అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) ఆర్.ఇందిరమ్మ
వెంకటాపురం నూగూరు,(విజయక్రాంతి): వెంకటాపురం మండల(Venkatapuram Mandal) పరిధిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఖాళీగా ఉన్న 18 అంగన్వాడీ టీచర్ (ఏడబ్ల్యుటి) పోస్టులు 70 అంగన్వాడీ హెల్పర్ (ఏడబ్ల్యుహెచ్) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) ఆర్. ఇందిరమ్మ తెలిపారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 5వ తేదీన అంగన్వాడీ టీచర్Anganwadi Teacher( పోస్టులకు, నవంబర్ 7వ తేదీన అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ములుగు జిల్లా(Mulugu District) కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(ఐడిఓసి)లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో 11:00 గంటల నుంచి 4:00 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సంబంధిత సీడీపీవో కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులుగా గుర్తించబడిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. అభ్యర్థుల అర్హత జాబితాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాలు సీడీపీవో కార్యాలయాల్లో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హతలు, వయస్సు, కులం, నివాసం తదితరాలకు సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. అర్హులైన అభ్యర్థులందరూ సకాలంలో ఇంటర్వ్యూ వేదికకు చేరుకుని ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సీడీపీవో ఆర్. ఇందిరమ్మ కోరారు.