భార్యతో కలిసి ఓటేసిన బాలయ్య
అభివృద్ధి చేసే వారికే ఓటేయండి.. బాలయ్య సూచన!
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని 3వ వార్డు చౌడేశ్వరి కాలనీలో ఏర్పాటు చేసిన Polling Boothకు సతీమణి వసుంధర దేవితో కలిసి చేరుకున్న ఆయన ఓటు వేశారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే పోలింగ్ కేంద్రానికి వచ్చి ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రజలకు కీలక సందేశం ఇచ్చారు. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం ప్రతి పౌరుడికి కల్పించిన స్వేచ్ఛ అని, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ఓటు వేయడం ద్వారా తమ ప్రాంత భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ప్రజలకు లభిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా, వ్యక్తిగత అభిమానం లేదా ఇతర అంశాల ఆధారంగా కాకుండా.. తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయగల సమర్థులైన అభ్యర్థులను గుర్తించి ఓటు వేయాలని సూచించారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుని, స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని కోరారు. ప్రతి ఓటు విలువైనదని, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఓటర్ల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని బాలకృష్ణ పేర్కొన్నారు.