గాంధీ ఆసుపత్రిలో విషాదం

22-10-2026 | 09:28pm
  1. గంజాయి మత్తులో తండ్రిపై సుత్తి, రోలుతో దాడి.             
  2. నిందితుడికి పోలీసుల రిమాండ్

జవహర్ నగర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): జవహర్ నగర్ పరిధిలో(Jawahar Nagar area) గంజాయి మత్తు మరోసారి ఘోరానికి దారితీసింది. గంజాయికి బానిసై విచక్షణ కోల్పోయిన కన్న కొడుకు, తన తండ్రిపైనే అతి కిరాతకంగా దాడికి పాల్పడ్డాడు. సుత్తి  రోలుతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన తండ్రి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.

ఈ సంఘటనకు సంబంధించి బాధితురాలి సోదరి మాధురి సుందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.జవహర్ నగర్ ఎస్ హెచ్ ఓ సైదులు వివరాలు

బాధితురాలి వివరాల ప్రకారం.. మాధురి సుందర్ కుటుంబం సికింద్రాబాద్‌లోని ఒకే నివాసంలో ఉంటోంది. సుందర్ అన్నయ్య మాధురి నాగరాజు (53) వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా, అతని కుమారుడు మాధురి పవన్ (25) గత కొన్ని సంవత్సరాలుగా గంజాయికి బానిసయ్యాడు. ఎన్నిసార్లు వారించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. గతంలోనూ పవన్ తన మేనత్త మాధురి సుందర్‌పై దాడి చేశాడు.

అర్ధరాత్రి హైడ్రామా: అక్టోబర్ 21వ తేదీ రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులంతా నిద్రపోయారు. అక్టోబర్ 22న తెల్లవారుజామున సుమారు 2:00 గంటలకు మూత్ర విసర్జనకు లేచిన మాధురి సుందర్.. పవన్ తనలో తాను మాట్లాడుకుంటూ నవ్వుతుండటాన్ని గమనించి నిద్రపోవాలని హెచ్చరించింది. ప్రాణాంతక దాడి: ఆ తర్వాత తెల్లవారుజామున 3:00 నుండి 3:30 గంటల మధ్యలో పవన్ తన తండ్రి నాగరాజుపై దాడి చేసినట్లు ఆమె తల్లి ఈశ్వరమ్మ వచ్చి తెలిపింది.

వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా.. నాగరాజు ముఖంపై టీ-షర్ట్ కప్పి, చంపుతానని బెదిరిస్తూ సుత్తి రోలుతో పవన్ పలుమార్లు తీవ్రంగా కొట్టినట్లు వెల్లడైంది. తీవ్ర రక్తస్రావంతో నాగరాజు రక్తపు మడుగులో పడిపోయాడు. దాడి అనంతరం పవన్ తన దుస్తులను తొలగించుకుని ఇంటి నుండి పారిపోయాడు.కుటుంబ సభ్యులు వెంటనే 112కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం 108 అంబులెన్స్ ద్వారా గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం నాగరాజు మాట్లాడలేని పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడు పవన్ పై హత్యాయత్నం (అట్టెంప్ట్ టూ మర్డర్ ) కింద కేసు నమోదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తండ్రిపై తాను దాడి చేసినట్లు అపరాధాన్ని అంగీకరించాడు. అనంతరం నిందితుడికి వైద్య పరీక్షలు  నిర్వహించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా.. న్యాయస్థానం పవన్‌కు రిమాండ్ విధించింది.

మరిన్ని వార్తలు