వైకల్యాన్ని జయించి భారత క్రికెట్ జట్టుకు ఎంపిక
మేడ్చల్ అర్బన్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): భారత డిసేబిలిటీ క్రికెట్ జట్టుకు (Indian Disability Cricket Team) ఎంపికైన మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని కీస్టాపూర్కు చెందిన వేముల సాయినాథ్ రెడ్డికి ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం మేడ్చల్‌లోని ఆర్ఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో సాయినాథ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి, చెక్కును అందించారు.
ఈ సందర్భంగా రాఘవేందర్ గౌడ్ మాట్లాడుతూ సాయినాథ్ రెడ్డి భారత డిసేబిలిటీ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం సంతోషకరమని తెలిపారు. శారీరక వైకల్యాన్ని అధిగమించి పట్టుదలతో కృషి చేసి జాతీయ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డి నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు సహాయం అందిస్తామని పేర్కొన్నారు.
అనంతరం సాయినాథ్ రెడ్డి మాట్లాడుతూ తనకు రూ.50 వేల ఆర్థిక సహాయం అందించడంతో పాటు క్రికెట్ బ్యాట్‌ను బహూకరించిన రాఘవేందర్ గౌడ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా అండర్-19 మహిళా క్రికెట్ జట్టుకు (Under-19 Women's Cricket Team) ఎంపికైన క్రీడాకారిణి శ్రీజకు ప్రోత్సాహకంగా రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్‌ను పలువురు అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ, వేముల రాజిరెడ్డి, కాంగ్రెస్ నాయకుడు కటిక వినయ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఫొటో క్యాప్షన్: భారత డిసేబిలిటీ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి చెక్కును అందజేస్తున్న ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాఘవేందర్ గౌడ్.