పంచాయతీ పక్కనే బెల్టు షాపు దందా
- కిరాణా దుకాణం ముసుగులో మద్యం విక్రయాలు
- ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్ముతున్నారని గ్రామస్తుల ఆరోపణ
- ఎక్సైజ్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి
- డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్
మంథని, అక్టోబర్ 29(విజయ క్రాంతి): గ్రామ పంచాయతీ(Village Panchayat) పక్కనే కిరాణా దుకాణం ముసుగులో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే ఆరోపణలు మంథని మండలం గ్రామాలలో కలకలం రేపుతున్నాయి. నివాస ప్రాంతంలో, పట్టపగలే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని గ్రామ ప్రజలతో పాటు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ డిమాండ్ చేశారు.
ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు
మంథని మండలంలోని నాగేపల్లి గ్రామ పంచాయతీ పక్కనే ఉన్న కిరాణా దుకాణంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రాయల్ స్టాగ్ క్వార్టర్ బాటిల్‌పై ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ఠ చిల్లర ధర రూ.220 ఉండగా, ఇక్కడ రూ.250కు విక్రయిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అధిక ధరలపై ప్రశ్నిస్తే దుకాణం నిర్వాహకులు దురుసుగా సమాధానమిస్తున్నారని వాపోతున్నారు.
గ్రామంలో మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులు
పంచాయతీ కార్యాలయానికి సమీపంలోనే, నివాస ప్రాంతంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమీపంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అంగన్వాడీ సిబ్బంది, మహిళలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
మంథని ఎక్సైజ్ శాఖ స్పందించాలి
ఈ వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ కోరారు. సంబంధిత దుకాణంలో తనిఖీలు నిర్వహించి, మద్యం విక్రయాలకు అవసరమైన అనుమతులు ఉన్నాయో లేదో పరిశీలించాలని డిమాండ్ చేశారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం మద్యాన్ని స్వాధీనం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నాగేపల్లిలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.