కౌన్సిల్‌లో వ్యర్థాల నిర్వహణపై అవగాహన

29-10-2026 | 06:38pm

జగిత్యాల, అక్టోబర్ 29 ( విజయ క్రాంతి ): జగిత్యాల పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ అధ్యక్షతన అక్టోబర్ నెల–2026 కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ హాజరయ్యారు.

కౌన్సిల్ సమావేశంలో భాగంగా ప్రొజెక్టర్ ద్వారా చెత్త నిర్వహణ, తడి చెత్త–పొడి చెత్త వేరు సేకరణ, వ్యర్థాల శాస్త్రీయ ప్రాసెసింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, పట్టణ పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం, మున్సిపల్ సిబ్బందికి సహకరించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పట్టణంలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచవచ్చని వివరించారు.

ఈ సందర్భంగా జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్  మాట్లాడుతూ చెత్త నిర్వహణలో ఆధునిక విధానాలను అవలంబిస్తూ పారిశుద్ధ్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మార్పు మన నుంచే ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించినప్పుడే పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడం సాధ్యమవుతుందని తెలిపారు.

చెత్త సమస్య జగిత్యాల పట్టణానికే పరిమితం కాలేదని, ధర్మపురి, కరీంనగర్‌తో పాటు పరిసర ప్రాంతాలు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయడం వల్ల పొగ, దుర్వాసన వంటి సమస్యలు తలెత్తి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

చెత్తను మూలస్థాయిలోనే తడి, పొడి చెత్తగా వేరు చేసి సేకరించడం, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతుల్లో ప్రాసెస్ చేయడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చని వివరించారు. గతంలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, చెత్త తిరిగి పేరుకు పోకుండా దీర్ఘకాలిక పరిష్కారాలపై దృష్టి సారించాలని సూచించారు.

చెత్త నిర్వహణలో ఆధునిక యంత్రాలు, బేలర్లు, ఇంటర్మీడియట్ కలెక్షన్ పాయింట్లను వినియోగించుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో చెత్త నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధరూర్ క్యాంప్‌లో ఇంటర్మీడియట్ కలెక్షన్ పాయింట్ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించారు.

ఈ కేంద్రం ద్వారా పొడి చెత్తను వేరు చేసి బేలర్ల సహాయంతో కట్టలుగా తయారు చేయడం వల్ల చెత్త రవాణాను సులభతరం చేయడంతో పాటు వ్యర్థాల నిర్వహణను మరింత క్రమబద్ధీకరించవచ్చని వివరించారు. ప్రతి వార్డులో కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్త వేరు చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు.

99 రోజుల ప్రజాపాలన కార్యాచరణలో భాగంగా జగిత్యాల పట్టణంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్వయంగా చొరవ తీసుకొని ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడం, ప్రజలకు చెత్త బుట్టలను అందుబాటులో ఉంచడం ద్వారా చెత్త సేకరణ, తడి చెత్త–పొడి చెత్త వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రతపై చైతన్యం కల్పించే కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కేంద్రస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల కౌన్సిల్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో వైస్ చైర్‌పర్సన్ జీనత్ పర్వీన్ మునీరుద్దీన్, మున్సిపల్ కమిషనర్ కె. సత్యప్రణవ్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు