రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో మహేంద్రహిల్స్ క్రీడాకారిణుల సత్తా

28-09-2026 | 09:47pm

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి అంకుశాపూర్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల(Social Welfare Gurukul Women's Degree College), మహేంద్రహిల్స్ అథ్లెటిక్స్ అకాడమీ క్రీడాకారిణులు(Mahendra Hills Athletics Academy players) రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటి మొత్తం 10 పతకాలు సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ తెలిపారు. హన్మకొండలోని జే.ఎన్. స్టేడియంలో సెప్టెంబర్ 26, 27 తేదీల్లో జరిగిన 12వ తెలంగాణ  స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌(Telangana State Junior Athletics Championship)లో క్రీడాకారిణులు వివిధ విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. తేజశ్రీ  జావెలిన్ త్రో, 4×100 మీటర్ల రిలేలో రెండు బంగారు పతకాలు, సౌమ్య 5000 మీటర్లు, 800 మీటర్లలో రెండు రజత పతకాలు, సింధు 10,000 మీటర్లలో రజత పతకం, నందిని 3000 మీటర్లలో కాంస్య పతకం, మంజుల 5000 మీటర్లలో కాంస్య పతకంతో పాటు 4×100 మీటర్ల రిలేలో బంగారు పతకం సాధించింది. రాధిక, రేవతి 4×100 మీటర్ల రిలేలో బంగారు పతకాలు సాధించారు. మొత్తంగా 5 బంగారు, 3 రజత, 2 కాంస్య పతకాలు సాధించారు.

ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని తెలిపారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సాధించిన ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింత కష్టపడి జాతీయ స్థాయిలో కూడా పతకాలు సాధించాలని విద్యార్థినులను ఉద్దేశించి ఆమె అన్నారు. క్రీడాకారిణులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న స్పోర్ట్స్ ఇన్‌చార్జి సవిత మేడం, కోచ్‌ బిక్షపతి, బోధన సిబ్బందితో పాటు రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారిణులకు ఆమె  మెడల్స్ వేసి, సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.

మరిన్ని వార్తలు