ట్రాన్స్‌జెండర్లకు ప్రశంస పత్రాలు

28-09-2026 | 09:33pm

గణేష్ నిమజ్జనోత్సవాల్లో విశేష సేవలందించిన ట్రాన్స్‌జెండర్లకు  ప్రశంస పత్రాలు

సేవా స్ఫూర్తితో ముందుకు వచ్చిన 107 మందిని అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

జగిత్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లాలో మూడు రోజుల పాటు నిర్వహించిన గణేష్ నిమజ్జనోత్సవాలను(Ganesh immersion festivals) ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించడంలో పోలీస్ శాఖకు సహకరిస్తూ విశేష సేవలు అందించిన ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వాల్మీకి ఆవాస్ విద్యార్థులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్(SP Ashok Kumar) ఐపీఎస్ అభినందించారు. ఈ సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నిమజ్జన బందోబస్తులో పాల్గొన్న 107 మందికి ప్రశంస పత్రాలను అందజేసి వారి సేవలను అభినందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులతో పాటు సమాజంలోని ప్రతి వర్గం భాగస్వామ్యం కావడం అభినందనీయమని అన్నారు. గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, శోభాయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీస్ సిబ్బందితో సహా ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వాల్మీకి ఆవాస్ విద్యార్థులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు.వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం, ట్రాఫిక్‌ను నియంత్రించడం, శోభాయాత్ర మార్గాల్లో ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు పోలీసులకు అవసరమైన సహకారం అందించారని ఎస్పీ పేర్కొన్నారు.

ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు భవిష్యత్తులో పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించేందుకు ఆసక్తి చూపితే, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విషయంలో పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ప్రశంస పత్రాలు అందుకున్న ట్రాన్స్‌జెండర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, వాల్మీకి ఆవాస్ విద్యార్థులు తమ సేవలను గుర్తించి ప్రోత్సహించినందుకు జిల్లా ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి చేతన్ నితిన్ ఐపిఎస్, ఇన్స్పెక్టర్ లు కరుణాకర్, ఆరిఫ్ అలీ ఖాన్,వేణు,ఎస్.ఐ లు కుమారస్వామి,మహేష్, సుప్రియ, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు