మత్తుపదార్థాలకు దూరంగా ఉందాం, మత్తుపదార్థ రహిత భారత్‌ను నిర్మిద్దాం
నాగిరెడ్డిపేట సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): మండలములోని గోపాల్‌పేటలోని తెలంగాణ మోడల్ స్కూల్(Telangana Model School) విద్యార్థులకు సురక్షితంగా ఉండటానికి, మత్తుపదార్థ రహిత భారత్‌ను(నషా ముక్త్ భారత్) నిర్మించడానికి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని మండల ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి సృజన కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య వైద్య అధికారి సృజన కుమార్(Primary Health Medical Officer Srujana Kumar) మాట్లాడుతూ... విద్యార్థులకు వివిధ రకాల మత్తుపదార్థాలు, వాటి శారీరక, మానసిక ప్రభావాల గురించి వివరించారు.
నేటి యువత తప్పుడు స్నేహాల కారణంగా మత్తుపదార్థాలకు బలి అవుతున్నారు. ప్రిన్సిపాల్ రాంప్రసాద్ మాట్లాడుతూ... మత్తుపదార్థాలు తీసుకోవడం ప్రారంభించినప్పటి నుండి ఒక వ్యక్తి వాటి నియంత్రణలోకి వస్తారని పేర్కొన్నారు. అందువల్ల, యువత అందరూ, ముఖ్యంగా విద్యార్థులు, మత్తుపదార్థాల దుష్ప్రభావాల గురించి తెలుసుకోవాలనీ, తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, పరిచయస్తులను మత్తుపదార్థాల విషయంలో జాగ్రత్త వహించేలా హెచ్చరించాలనీ తెలిపారు. విద్యార్థులతో 'నషా ముక్త్ భారత్' ప్రతిజ్ఞ చేయించగా, విద్యార్థులందరూ తమ చేతులను గుండెలపై ఉంచుకుని ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.