జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును తరలించాలని ఎంపీ

27-10-2026 | 04:03pm

ఘట్ కేసర్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డును(Jawaharnagar Dumping Yard) తరలించి, కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే డిమాండ్‌తో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ మంగళవారం పాదయాత్ర చేపట్టారు. మేడ్చల్ జిల్లా, ఘట్ కేసర్ సర్కిల్ పరిధి ఎదులాబాద్‌లోని లక్ష్మీనారాయణ చెరువు వద్ద ఈ పాదయాత్ర ప్రారంభమైంది.

మొత్తం 60 కిలోమీటర్ల మేర సాగే ఈ పాదయాత్రలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపే లక్ష్యంగా ఈటల రాజేందర్‌ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. డంపింగ్‌ యార్డు నుంచి వెలువడే దుర్వాసన, వ్యర్థాల వల్ల భూగర్భ జలాలు, జలవనరులు కలుషితమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

దీంతో కీసర, ఘట్‌కేసర్‌ మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈసమస్యపై గతంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఎదులాబాద్‌లో ప్రారంభమైన ఈ పాదయాత్ర తొలిరోజు మర్రిపల్లిగూడ, చందుపట్లగూడ, ఎన్‌ఎఫ్‌సీ నగర్‌, బొక్కనిగూడ, ఘనాపూర్‌ మీదుగా అన్నోజిగూడకు చేరుకోనుంది. డంపింగ్‌ యార్డు తరలింపు, కాలుష్య నియంత్రణకు శాశ్వత చర్యలు చేపట్టాలనే డిమాండ్‌తో పాదయాత్ర కొనసాగుతోంది.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షులు విక్రం రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఘట్కేసర్ డివిజన్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు