జాతీయ స్థాయి క్రీడా పోటీలకు సీఆర్‌పీఎఫ్‌ విద్యార్థి ఆదిత్య

10-09-2026 | 08:20pm

జవహర్ నగర్,(విజయక్రాంతి): స్థానిక సీఆర్‌పీఎఫ్‌ పాఠశాల(CRPF School) విద్యార్థి ఆదిత్య కుష్వాహా ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థికి అభినందన సభ నిర్వహించారు. ప్రిన్సిపాల్‌ డి.అపర్ణ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరమని, తమ పాఠశాలలో క్రీడలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పాఠశాల నుంచి పలువురు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.

ఫిజికల్‌ డైరెక్టర్‌ కురపాటి రాజశేఖర్‌(Physical Director Kurapati Rajasekhar) మాట్లాడుతూ ఆదిత్య ఈ నెల 19 నుంచి హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో జరిగే సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ హరీశంకర్‌, హెచ్‌ఎం ఆశా జి.కుమార్‌, ఉపాధ్యాయులు కిషోర్‌, గోపాలకృష్ణ, నూర్జహాన్‌, పీఈటీలు భాస్కర్‌రెడ్డి, మన్మథరావు తదితరులు పాల్గొని ఆదిత్యను అభినందించారు.

మరిన్ని వార్తలు