ఇన్ఫోసిస్ నూతన భవనం ప్రారంభోత్సవం

26-10-2026 | 08:19pm

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ మను చౌదరి

ఘట్ కేసర్,(విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన ఘట్ కేసర్ సర్కిల్ పరిధి పోచారంలోని ఇన్ఫోసిస్ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ మనుచౌదరి(Collector Manu Chowdary) సోమవారం పరిశీలించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నిర్వహించే ఇన్ఫోసిస్(Infosys) నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులకు, ఇన్పోసిస్ కంపెనీ అధికారులకు కలెక్టర్ అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఎం హెలిక్యాప్టర్ ద్వారా రానున్నందున అందుకు అవసరమైన హెలిప్యాడ్   నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లను పరిశీలించి, తీసుకోవలసిన జాగ్రత్తలు, సలహాలను ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. అలాగే సిఎం చేసే భవన ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి, సమావేశం గురించి ఇన్ఫోసిస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. విఐపిలు ఎంతమంది ఉంటారని, సమావేశానికి ఎంత మంది హాజరవుతారని తెలుసుకొని అందుకు అనుగుణంగా భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖ అధికారులకు తెలియజేశారు.

ముఖ్యమంత్రి ద్వారా నిర్వహించే కార్యక్రమాల గురించి తెలుసుకొని ప్రత్యక్షంగా పరిశీలించారు.  ముఖ్యమంత్రి కార్యక్రమానికి గాను ఇన్ఫోసిస్ అధికారులకు సంబంధిత శాఖల అధికారులకు పూర్తి సహాయ సహాకారాలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో కీసర ఆర్డిఓ వెంకట్ రెడ్డి, ఘట్కేసర్ తహసిల్దార్ చంద్రశేఖర్, జిల్లా ఆర్ అండ్ బి ఈఈ జలంధర్, ఇన్ఫోసిస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు