విద్యుత్ ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం!
* నార్సింగి సబ్స్టేషన్లో విద్యుత్ సమస్యలపై ప్రత్యేక సదస్సు..
* 14 ఫిర్యాదులు.. పరిష్కారానికి అధికారుల భరోసా
పాపన్నపేట, నవంబర్03: రైతులు, విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపించేందుకు విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మంగళవారం నార్సింగిలోని 33/11 కేవీ సబ్స్టేషన్(KV Substation)లో వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రైతులు, విద్యుత్ వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా పాపన్నపేట, అల్లాదుర్గం, రేగోడు మండలాలకు చెందిన వినియోగదారుల నుంచి మొత్తం 14 పిర్యాదులు అందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రధానంగా లైన్ షిఫ్టింగ్, డీటీఆర్ సమస్యలు, 33/11 కేవీ సబ్స్టేషన్ సంబంధిత పనులు, ఎల్టీ లైన్ మార్పు, అదనపు విద్యుత్ లోడ్లు, 11 కేవీ లైన్ షిఫ్టింగ్, అంతర్గత విద్యుత్ స్తంభాల ఏర్పాటు తదితర సమస్యలపై వినతులు అందజేశారు. వినియోగదారులు సమర్పించిన ప్రతి దరఖాస్తును అధికారులు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. రైతులు, గృహవిద్యుత్వినియోగదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చేలా ఈ సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ వెంకటేశ్వరరావు, ఏఈలు నర్సింలు, ఉదయ్ భాస్కర్, నవాజ్, శ్యాంసుందర్, నర్సింలు, విద్యుత్ శాఖ సిబ్బంది, రైతులు, వినియోగదారులు పాల్గొన్నారు.