నీటిని పొదుపుగా వాడి కరువు పరిస్థితులను ఎదుర్కొందాం

03-11-2026 | 08:35pm

మహబూబ్‌నగర్ రూరల్: మండలం ధర్మపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఎల్‌నినో ప్రభావం, రాబోయే కరువు పరిస్థితులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యాయవాది తగిలి కృష్ణ నేతృత్వంలో పాలమూరు విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల(Palamuru University College of Law) విద్యార్థులు నీటి కొరత, ఆహార కొరత, విద్యుత్ పొదుపు, వ్యవసాయంపై ఎల్‌నినో ప్రభావం తదితర అంశాలను ఛాయాచిత్రాల ద్వారా వివరించారు. ఈ సందర్భంగా తగిలి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీరు, విద్యుత్, ఆహారం, ఇంధనాన్ని పొదుపుగా వినియోగించాలని సూచించారు.

విద్యార్థులు తమ గ్రామాల్లో ప్రజలకు కరువు పరిస్థితులపై అవగాహన కల్పించాలని కోరారు. ఉపసర్పంచ్ భోలే యాదయ్య మాట్లాడుతూ గ్రామంలో ప్రజలకు నీటి పొదుపు, ఇంకుడు గుంతల ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎల్‌నినోపై రూపొందించిన గోడపత్రికను పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ మాధవి వర్మ ఆవిష్కరించారు. కరువు పరిస్థితులపై చక్కగా మాట్లాడిన పదో తరగతి విద్యార్థిని వసంతకు న్యాయవాది తగిలి కృష్ణ రూ.500 నగదు బహుమతి అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు