పోశెట్టి నివాళి గీతం ఆవిష్కరణ
బెల్లంపల్లి, (విజయ క్రాంతి): ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట వీరుడు పోతుగంటి పోశెట్టి (Pothuganti Poshetti, a hero of the Telangana Armed Struggle)నివాళి గీతాన్ని గురువారం స్థానిక సీపీఐ పట్టణ కార్యాలయంలో ఆయన కుమారుడు పోతుగంటి అశోక్, సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి మిట్టపల్లి వెంకటస్వామి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఆడెపు రాజమౌళిలతో కలిసి ఆవిష్కరించారు. పోశెట్టి 45వ వర్ధంతిని పురస్కరించుకుని తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, బెల్లంపల్లిలో కమ్యూనిస్టు పార్టీకి బలమైన పునాది వేయడంలో పోశెట్టి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీని బెల్లంపల్లికి తీసుకురావడంతో పాటు నాయకులను తీర్చిదిద్ది, కార్యకర్తలను సమీకరించి పార్టీని బలోపేతం చేశారని తెలిపారు.
ఆయన నాయకత్వంలో బెల్లంపల్లి సీపీఐ కంచుకోటగా ఎదిగిందన్నారు. ఆసిఫాబాద్ సమితికి మూడుసార్లు ఉపాధ్యక్షుడిగా, ఒకసారి అధ్యక్షుడిగా, చాకేపల్లికి వరుసగా నాలుగు సార్లు ఏకగ్రీవ సర్పంచ్‌గా కూడా ప్రజలకు సేవలందించి ప్రజల మనిషిగా వారి గుండెల్లో నిలిచిపోయారని గుర్తుచేశారు. పోశెట్టి పోరాట జీవితం, ప్రజా సేవ, కమ్యూనిస్టు ఉద్యమానికి ఆయన చేసిన కృషిని భావితరాలకు పరిచయం చేసే ఉద్దేశంతో నివాళి గీతాన్ని రూపొందించినట్లు గీత రచయిత, పోశెట్టి మనవడు పోతుగంటి భరత్ రుషి తెలిపారు.
పోరాట యోధుడిగా ఆయన ప్రదర్శించిన స్ఫూర్తి, ప్రజా నాయకుడిగా అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, తాండూరు మండల కార్యదర్శి కొండు బానేష్, జిల్లా సమితి సభ్యుడు చంద్రమాణిక్యం, బీకేఎంయూ జాతీయ సమితి సభ్యుడు అక్కేపల్లి బాపు, ఎస్సీడబ్ల్యూ యు బెల్లంపల్లి అసిస్టెంట్ సెక్రటరీ దాసరి తిరుపతిగౌడ్, ప్రజా నాట్యమండలి జిల్లా ఉపాధ్యక్షుడు బొంకురి రామచందర్, నాయకులు స్వామిదాస్, ఇనుముల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.