పోలీసుల విధులపై అవగాహన
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : పోలీసుల విధులు, మహిళలు, చిన్నారుల రక్షణలో పోలీస్ శాఖ(Police Department) పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మంగళ వారం ‘ఓపెన్ హౌస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో షీ టీమ్స్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా పోలీస్ శాఖ విధులు, బాధ్యతలు, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతకు తీసుకుంటున్న చర్యలను విద్యార్థులకు వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన కల్పిస్తూ ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తమ సమస్యలను నిర్భయంగా పెద్దలతో పంచుకోవాలని తెలిపారు.
పోలీసులు వినియోగించే కమ్యూనికేషన్ పరికరాలు, నేరాల దర్యాప్తులో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పోలీసింగ్ విధానాలను విద్యార్థులకు పరిచయం చేశారు. పోలీస్ వ్యవస్థ పనితీరును ప్రత్యక్షంగా తెలుసుకునేలా చేయడం, పోలీసుల సేవలపై అవగాహన పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి, మహిళా పోలీస్ స్టేషన్, షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.