పోలియో రహిత సమాజమే లక్ష్యం

24-10-2026 | 06:25pm

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ 

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): ప్రతి చిన్నారికి పోలియో టీకాలు(Polio vaccines) అందించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DMHO) డాక్టర్ నరేందర్ రాథోడ్(Narender Rathod) తెలిపారు. ప్రపంచ పోలియో నివారణ దినోత్సవాన్ని(World Polio Eradication Day) పురస్కరించుకుని శనివారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రెడ్‌క్రాస్‌, మంచిర్యాల జిల్లా లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ప్రచార కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ... ఐదేళ్లలోపు చిన్నారులందరికీ జాతీయ టీకాల కార్యక్రమంలో(National Immunization Programme) భాగంగా నిర్ణీత సమయానికి పోలియో టీకాలు వేయించాలని సూచించారు. పోలియో వైరస్‌ ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని, జ్వరం, అలసట, తలనొప్పి, వాంతులు, మెడ బిగుసుకుపోవడం, చేతులు, కాళ్లలో నొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చని వివరించారు. కలుషిత నీరు, ఆహారం, మలంలోని వైరస్‌ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని తెలిపారు.

పోలియో నివారణకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మరుగుదొడ్లను వినియోగించాలని, బహిరంగ మలవిసర్జనకు దూరంగా ఉండాలని సూచించారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడంతోపాటు సురక్షితమైన తాగునీటిని వినియోగించాలని పేర్కొన్నారు. చిన్నారులకు టీకాలు వేయించడం ద్వారా పోలియో ముప్పును నివారించవచ్చని తెలిపారు.

భారత్‌లో చివరిసారిగా 2011 జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో పోలియో కేసు నమోదైందని, 2014 మార్చి 27న ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతాన్ని పోలియో రహిత ప్రాంతంగా ప్రకటించిందని వివరించారు. పోలియో రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టీకాల అధికారి, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, ఎండీ రషీద్‌, సీహెచ్‌ఓ కాకిరాల వెంకటేశ్వర్లు, జిల్లా రెడ్‌క్రాస్‌ సొసైటీ, లయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు భాస్కర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు