హద్దు దాటి వైద్యం చేస్తే చర్యలు తప్పవు
డీఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్
లక్షేట్టిపేట, అక్టోబర్ 7 : మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట మండలంలో(Luxettipet Mandal) పరిమితికి మించి వైద్యం(Medical Treatment) అందిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆర్ ఎం పీ, పీ ఎం పీ వైద్యం మీద ‘విజయక్రాంతి‘లో ఈ నెల 7న ‘ప్రాణాలు హరిస్తున్న ఆర్‌ఏంపీల చికిత్స‘ శీర్షికన ప్ర చురితమైన కథనానికి జిల్లా వైద్యారోగ్యశాఖధి కారులు స్పందించారు. మంచిర్యాల డీఏంహెచ్‌ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈ కథనం ఆధారంగా తీసుకుంటున్న పలు రకాల చర్యల గురించి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) తో పాటు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హైదరాబాద్ కు వివరిస్తూ లేఖ రాశారు. జిల్లాలో ఇప్పటి వరకు 18 ఆర్‌ఏంపీ, పీఏంపీ క్లినిక్ లను మూసివేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని ఆర్‌ఏంపీ, పీఏంపీలకు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆదేశాలున్నట్లు వివరించారు. జిల్లాలో ఆర్‌ఏంపీ, పీఏంపీలు స్థాయికి మించి వైద్యం చేయవద్దని హెచ్చరించారు.
అంతేకాకుండా జిల్లా వైద్యారోగ్యశాఖ, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టి అనర్హులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఆర్‌ఏంపీ, పీఏంపీల ప్రాణాంతక చికిత్సలను అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.