రైతన్నా బీ అలర్ట్.. నాసిరకం ఎరువులతో జర జాగ్రత్త

13-10-2026 | 10:41am

మంచిర్యాల జిల్లా, చెన్నూరు, అక్టోబర్ 13 (విజయక్రాంతి): నాసిరకం ఎన్‌పీకే మిక్చర్‌ ఎరువుల (NPK Mixture Fertilizers) విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సహాయ వ్యవసాయ సంచాలకులు బానోత్ ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కె. యామిని సూచించారు. మహారాష్ట్ర, భూపాలపల్లి ప్రాంతాల నుంచి ఎరువులు కొనుగోలు చేయవద్దని చెన్నూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని చెన్నూరు, అంగరాజపల్లి, ఆస్నాద్, దుగ్నేపల్లి, సుందరశాల, కత్తెరసాల గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో జై జవాన్‌ ఎన్‌పీకే మిక్చర్‌ ఎరువులు ఎక్కడా కనిపించలేదని తెలిపారు.

ఐదు మండలాల రైతులకు సూచన

చెన్నూరు వ్యవసాయ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల రైతులు పక్కనున్న భూపాలపల్లి, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి ఎన్‌పీకే మిక్చర్‌ ఎరువులను కొనుగోలు చేయవద్దని అధికారులు సూచించారు. ఎరువుల నాణ్యతపై అనుమానాలు ఉంటే అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.

పోషకాల మోతాదుపై అప్రమత్తత అవసరం

ఎన్‌పీకే మిక్చర్‌ ఎరువుల్లో (NPK Fertilizer Quality) పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ పోషకాలు తగిన మోతాదులో లేకపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నాసిరకం ఎరువుల వినియోగం వల్ల పంటలకు అవసరమైన పోషకాలు అందకపోవచ్చని పేర్కొన్నారు. రైతులు ఎరువులు కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, సంబంధిత వివరాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు