బతుకమ్మ పూలకు భలే డిమాండ్...కిలోమీటర్ల నుంచి రాక

13-10-2026 | 11:22am

బోథ్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ నేపథ్యంలో గునుగు పూలకు డిమాండ్‌ పెరిగింది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలంలోని పంట పొలాల్లో విరివిగా లభించే గునుగు పూలను సేకరించేందుకు ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు తరలివస్తున్నారు. గత రెండు రోజులుగా పెద్దపల్లి జిల్లాకు చెందిన పలువురు బోథ్‌ మండలానికి వచ్చి పొలాల్లోని గునుగు పూలను సేకరించి తమ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గునుగు పూల వ్యాపారులు వాహనాల్లో వచ్చి కూలీల సాయంతో పూలను సేకరిస్తున్నారు. ఇక్కడ సేకరించిన పూలను కిలో రూ.20 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు వారు తెలిపారు. తమ ప్రాంతాల్లో గునుగు పూలు విరివిగా లభించకపోవడంతో సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని బోథ్‌ మండలానికి వచ్చి పూలను తీసుకెళ్తున్నట్లు వివరించారు.

రెండు రోజులపాటు ఇక్కడే ఉండి పూలను సేకరించి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు వ్యాపారులు తెలిపారు. సేకరించిన పూలను సుమారు వారం రోజులపాటు జాగ్రత్తగా భద్రపరిచి విక్రయిస్తామని పేర్కొన్నారు. రంగులు అద్ది బతుకమ్మల తయారీ.. సేకరించిన గునుగు పూలకు వివిధ రంగులు అద్ది బతుకమ్మలను పేర్చేందుకు వినియోగిస్తారని వ్యాపారులు తెలిపారు. బతుకమ్మ పండుగ సమయంలో ఈ పూలకు మంచి డిమాండ్‌ ఉండటంతో ప్రతి ఏటా ఈ సీజన్‌లో తమకు ఉపాధి లభిస్తోందని వివరించారు. గత ఏడాది కూడా కరీంనగర్‌ జిల్లాకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతం నుంచి గునుగు పూలను సేకరించి తీసుకెళ్లారు. ఈ ఏడాది పెద్దపల్లి జిల్లా వాసులు రావడంతో బతుకమ్మ పండుగ వేళ గునుగు పూల వ్యాపారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు