నిన్న కొడుకు క్షేమంపై తల్లి ఆందోళన.. నేడు మృతి వార్త!

13-10-2026 | 11:00am

కామారెడ్డి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణకు చెందిన మరో యువకుడు మృతి చెందినట్లు సమాచారం అందింది. కామారెడ్డి జిల్లా తడ్కోల్‌కు చెందిన అఫ్జల్‌ఖాన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. నిన్నటి వరకు తన కుమారుడు బతికే ఉన్నాడా? అని ఆందోళనతో ఎదురుచూసిన తల్లికి, నేడు అతడు మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

ఉపాధి కోసం రష్యాకు వెళ్లి..

అఫ్జల్‌ఖాన్‌ ఉపాధి కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో రష్యాకు వెళ్లాడు. అక్కడ సుమారు ఐదు నెలలపాటు మెకానిక్‌గా పనిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇటీవల ఓ ఏజెంట్‌ అతడిని రష్యా సైన్యంలో చేర్చినట్లు సమాచారం. దీంతో అతడు యుద్ధంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

నిన్న కొడుకు క్షేమంగా ఉన్నాడా? అని ఆరా.. నేడు మృతి వార్త

తన కుమారుడి ఆచూకీ తెలియక అఫ్జల్‌ఖాన్‌ తల్లి తీవ్ర ఆందోళనకు గురైంది. నిన్న కూడా తన కొడుకు బతికే ఉన్నాడా? అని ఆవేదనతో ప్రశ్నించిన ఆమెకు, నేడు అతడు మృతి చెందినట్లు సమాచారం అందింది. అఫ్జల్‌ఖాన్‌ పది రోజుల క్రితమే మరణించినట్లు అతడితో కలిసి పనిచేసిన ఓ కార్మికుడు ఆడియో సందేశం పంపినట్లు తెలిసింది.

కుమారుడి మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే అఫ్జల్‌ఖాన్‌ మృతికి సంబంధించి అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చే అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు