భీమ్ వర్ధంతి వేడుకలు
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్ లో గల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో సోమ వారం ఆదివాసీ వీరుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి వేడుకలు(Komaram Bheem 86th Death Anniversary) ఐక్య విద్యార్థి, జిల్లా కోయ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆదివాసీల హక్కుల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప పోరాట యోధుడు, విప్లవ వీరుడు కొమురం భీమ్ అని, జల్ – జంగల్ – జమీన్ (నీరు – అడవి – భూమి) నినాదంతో ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి కోసం పోరాడిన కొమురం భీమ్ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.
అణిచివేతకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, కొమురం భీమ్ ఆశయాలను కేవలం వర్ధంతి కార్యక్రమాలకే పరిమితం చేయకుండా, ఆదివాసీలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, అటవీ హక్కులు, విద్య, వైద్యం, ఉపాధి, తాగునీరు వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని.ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, భాషలను పరిరక్షించడంతో పాటు. రాజ్యాంగం కల్పించిన హక్కులను సమర్థవంతంగా అమలు చేస్తూ, గిరిజన ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆదివాసీ యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేయాలని.కొమురం భీమ్ ఆశయ సాధనే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి, ఆయన పోరాట స్ఫూర్తితో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర కార్యదర్శి చిప్పకుర్తి శ్రీనివాస్, జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పూరెల్ల నితీష్, జిల్లా కోయ సంఘం గౌరవ అధ్యక్షులు నైతం లక్ష్మణ్, నస్పూర్ మండల అధ్యక్షులు ఆత్రం సమ్మయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.