వ్యవసాయ ఎగుమతి, యాంత్రీకరణపై అవగాహన
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట రైతు వేదికలో మంగళ వారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో('Raithu Nestham' (Farmer's Friend) Program) నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంఘాల (FPOs)(Farmer Producers Associations), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS), స్వయం సహాయక సంఘాల (SHGs) సభ్యులకు వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి అవకాశాలు,
వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM) పై అవగాహన కల్పించారు. జిల్లా వ్యవసాయ అధికారి మంచిర్యాల సురేఖ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్, గ్రేడింగ్, ప్యాకింగ్, విలువ జోడింపు ద్వారా మెరుగైన ధరలకు విక్రయించడంతో పాటు, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న ఎగుమతి అవకాశాలను వినియోగించుకోవాలని సభ్యులకు వివరించారు.
FPOలు, PACS, SHGs సమష్టిగా పనిచేస్తూ రైతుల ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేయాలని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం (SMAM) కింద అర్హత కలిగిన సంస్థలు 40 శాతం రాయితీతో గరిష్టంగా రూ.50 లక్షల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాలతో కస్టమ్ హైరింగ్ సెంటర్ల (CHCs) ఏర్పాటు చేసుకునే అవకాశాల గురించి వివరించారు.
ఈ కేంద్రాల ద్వారా ట్రాక్టర్లు, విత్తనాలు విత్తే యంత్రాలు, కలుపు నివారణ పరికరాలు, పిచికారీ యంత్రాలు మరియు ఇతర వ్యవసాయ పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురావచ్చని తెలిపారు. అర్హత కలిగిన FPO, PACS, SHG సభ్యులు పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానం,
యంత్ర పరికరాల ఎంపిక మరియు పథకం ద్వారా కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరిగింది. వ్యవసాయ యాంత్రీకరణతో సాగు ఖర్చులను తగ్గించి, వ్యవసాయ పనులను సకాలంలో పూర్తి చేసుకోవడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో పడతనపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ తోట రవి, కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కొట్టే మహేందర్, రైతు ఉత్పత్తి దారుల సంఘం డైరెక్టర్ బొడ్డు శంకర్, PACS డైరెక్టర్లు, ఆత్మ డైరెక్టర్లు, AMC డైరెక్టర్లు, మంచిర్యాల ADA మామిడి క్రిష్ణ, ADA గోపి, హాజీపూర్ AO క్రిష్ణ, AEO మధుప, రైతులు తదితరులు పాల్గొన్నారు.