అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం (జైపూర్), (విజయక్రాంతి): ప్రజా సంక్షేమంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలోని సమత రైస్ మిల్ ను అధికారులతో కలిసి సందర్శించి రైస్ మిల్లుకు కేటాయించిన వరి ధాన్యం లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, సి.ఎం.ఆర్. ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
మండలంలోని మద్దికల్ గ్రామాన్ని ఉప తహసిల్దార్ అంజమ్మతో కలిసి సందర్శించి గ్రామంలో చేపట్టే రీ సర్వే ప్రక్రియను త్వరగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల హాజరు పట్టిక, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణ అంశాలను పరిశీలించారు. అధికారులు, సిబ్బంది విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయానికి సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పాఠశాలలోని స్టోర్ గది, వంటగదిని తనిఖీ చేసి, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న మందుల నిల్వలు, ఇతర వైద్య సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.