భూగర్భ జలాల పెంపునకు అవకాశం
నవాబుపేట: జలసిరి పథకం(Jalasiri Scheme) ద్వారా భూగర్భ జలాలను పెంచి, భవిష్యత్తులో తాగునీటి ఎద్దడిని నివారించవచ్చని నవాబుపేట ఎంపీడీవో జయరాం నాయక్(Nawabpet MPDO Jayaram Naik) అన్నారు. మండలంలోని ఊరంచి తండా, రేకుల చౌడాపూర్ గ్రామాల్లో ప్రభుత్వ తాగునీటి బోరు మోటార్ల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణ పనులకు శుక్రవారం గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గుతున్నాయని తెలిపారు. బోరు మోటార్ల వద్ద వృథాగా పోయే నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, బోరు బావుల వద్ద కూడా ఇంకుడు గుంతలు నిర్మించాలని పేర్కొన్నారు.
ప్రజలు తమ వ్యవసాయ పొలాలు, ఇళ్ల ఆవరణల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జలసిరి పథకం భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, క్షేత్ర సహాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.