అప్రమత్తతతొ పాటు వ్యక్తిగత భద్రత కూడా ముఖ్యమే
తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్. శబరీష్
తొర్రూర్,(విజయక్రాంతి): తొర్రూర్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డాక్టర్. శబరీష్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించి పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు, లాకప్, రైటర్స్ రూమ్ తదితర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, రికార్డుల నిర్వహణ, సిబ్బంది విధులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐతో స్టేషన్ పరిధిలోని పోలీసింగ్ అంశాలపై ఎస్పీ సమీక్షించారు. CCTNS ఆన్‌లైన్ ప్రక్రియలు, Digital Hour వినియోగం, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, గ్రామాల సందర్శనలు తదితర అంశాలపై చర్చించారు.
స్టేషన్ పరిధిలోని Suspect Sheets, Rowdy Sheets నిర్వహణ, వాటిలో ఉన్న వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచడం, అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించి నిరంతర తనిఖీలు, నిఘా, చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. అలాగే గుడుంబా తయారీ, విక్రయాలపై కఠినంగా వ్యవహరించాలని, అక్రమ మద్యం నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా Drunk and Drive తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి రాత్రి వేళల్లో పెట్రోలింగ్, వాహన తనిఖీలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాల ఏర్పాటు, అనుమతులు, భద్రతా చర్యలు, నిర్వాహకులతో సమన్వయం తదితర అంశాలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్‌లోని పోలీస్ సిబ్బంది సంఖ్య, వారి విధులు, బాధ్యతలు తదితర వివరాలను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. స్థానిక బందోబస్తు విధుల్లో పాల్గొనే ప్రతి పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా అవసరమైన రక్షణ పరికరాలు, విధి నిర్వహణకు సంబంధించిన సరైన లాఠీ, రక్షణ వస్తువులు వెంట తీసుకెళ్లాలని సూచించారు.






