కొత్తగూడెంలో కదం తొక్కిన విద్యార్థి, యువకులు
BRSV ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
ఎంపీ వద్దిరాజు ముఖ్య అతిధిగా హాజరు
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై గొంతేత్తిన నవతరం
13 వేల కోట్ల ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి..!
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయాలి..!
ఎంపీ వద్దిరాజు డిమాండ్
కొత్తగూడెం,(విజయక్రాంతి): విద్యార్థులు,యువత జీవితాలతో చెలగాటమాడిన పాలకులెవ్వరూ కూడా బతికిబట్టకట్టిన దాఖలాలు లేవని,వారి శక్తి ముందు ఎంతటి నియంత అయినా కూడా తలవంచక తప్పదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. నీట్ పేపర్ లీక్ ను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద వేలాదిమంది విద్యార్థులు, యువత గుమిగూడడంతో ప్రధాని నరేంద్రమోడీ దిగివచ్చి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించడాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ సర్కార్ 1000 రోజుల పాలనా వైఫల్యాలను నిరసిస్తూ టిఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థులు, నిరుద్యోగ యువకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మండుటెండలో లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్ నుంచి గణేష్ టెంపుల్ వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, యువత ప్లకార్డులు చేబూని ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు.
ర్యాలీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎంపీ రవిచంద్ర విద్యార్థులు, యువకులతో కలిసి ర్యాలీలో నడిచారు. గణేష్ టెంపుల్ వద్ద జరిగిన సభలో విద్యార్థులను ఉద్దేశించి ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వాన తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగిన మహోద్యమంలో విద్యార్థులు అగ్రభాగాన నిలిచారన్నారు. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రాన్ని కూడా సమూలంగా మార్చివేసింది విద్యార్థి శక్తేనని ఆయన వివరించారు. రేవంత్ రెడ్డి 1000 అబద్ధాలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులు, విద్యావంతులైన యువతను అరిగోస పెడుతున్నారని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తంచేశారు.
అన్ని వర్గాల వారికి ఇంగ్లీష్ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఉచిత విద్యను అందించాలనే సంకల్పంతో కేసీఆర్ 1050 గురుకులాలను గొప్పగా తీర్చిదిద్దితే.. అవగాహన లేని ఈ పాలకులు వాటిని అధ్వాన్నంగా మార్చారని మండిపడ్డారు. తమ బంగారు భవిష్యత్తు కోసం కళాశాలలో ఉండాల్సిన విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం బాధాకరమని ఎంపీ వద్దిరాజు చెప్పారు.రేవంత్ రెడ్డి 1000 రోజుల పాలన వెర్రి పరిపాలన అని,100 రోజుల్లోనే అన్నింటినీ పరిష్కరిస్తానని గొప్పలు చెప్పి ఈ 33 నెలలలో ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలుపర్చలేదని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3లక్షల కోట్లు అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి 13వేల కోట్ల ఫీజు బకాయిలను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సరూర్ నగర్ స్టేడియంలో ఆర్భాటంగా ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఒట్టిదేనని ఈ 1000 రోజుల పాలనలో తేలిపోయిందన్నారు.రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకునే తిరిగే రాహూల్ గాంధీకి అశోక్ నగర్,చిక్కడపల్లిలకు వచ్చి యువతకు ఇచ్చిన హామీలు గుర్తుకు రావడం లేదా అని ఎంపీ వద్దిరాజు నిలదీశారు.తమ బతుకులను రోడ్డున పడేసిన కాంగ్రెస్ సర్కార్ పట్ల మండిపడుతున్న విద్యార్థులు,యువత చేతుల్లో పాలకులకు ఘోర పరాభవం తప్పదని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.
పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుకు గుదిబండగా మారిన జీవో 97ను రద్దు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 13వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయాల్సిందిగా ఎంపీ వద్దిరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్లకార్డులు చేబూని నిరసన ప్రదర్శనలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు,యువత,గులాబీ కండువాలు ధరించి, జెండాలు,బ్యానర్లతో బీఆర్ఎస్ శ్రేణులు"వద్దురా నాయన కాంగ్రెస్ పాలన","ఇదేమీ రాజ్యం ఇదేమీ రాజ్యం దొంగల రాజ్యం దోపీడీ రాజ్యం","డౌన్ డౌన్ సీఏం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్"అంటూ గొంతెత్తి నినదించారు.






