పైన కొబ్బరి బొండాలు.. లోపల పశువుల అక్రమ రవాణా
- ప్రత్యేకంగా అమర్చిన వ్యాన్ పట్టివేత
- ముగ్గురిపై కేసు నమోదు
- ఆంధ్రా నుంచి హైదరాబాద్ కు అక్రమ రవాణా
మహబూబాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): వ్యాన్‌లో ప్రత్యేకంగా పై భాగంలో కొబ్బరి బొండాలు(Tender coconuts) కనిపించే విధంగా ఏర్పాటుచేసి, లోపల పశువులను కుక్కి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కు పశువులను అక్రమ రవాణా(Illegal trafficking) చేస్తున్న ముఠా గుట్టును మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీసులు రట్టు చేశారు.
మరిపెడ ఎస్సై సతీష్(Maripeda SI Satish) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై పెట్రోలింగ్‌లో ఉన్న మరిపెడ పోలీసు సిబ్బంది పీసీ నరేష్, పీసీ జీ. శ్రీను అనుమానాస్పదంగా నంబర్ ప్లేట్ లేకుండా కొబ్బరి బొండాలతో వెళ్తున్న టాటా ట్రాలీ వాహనాన్ని గుర్తించి ఆపి తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో వాహనంలో కొబ్బరి బొండాల మాటున కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టివేసి కదలలేని స్థితిలో ఉంచిన 6 ఆవులు, 2 కోడెగిత్తలు, మొత్తం 8 పశువులను గుర్తించారు. పశువులను అమానుషంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అనే ముగ్గురు నిందితులను గుర్తించారు.
నిందితులు అనకాపల్లి ప్రాంతం నుంచి పశువులను సేకరించి, కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్‌లోని కబేళాలకు గత కొంతకాలంగా అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.పోలీసులు రక్షించిన పశువులను సురక్షిత ప్రాంతానికి తరలించి, పశువైద్యుల ద్వారా అవసరమైన చికిత్స అందించారు. గాయపడిన పశువులు ప్రస్తుతం కోలుకున్నాయి.
పశువుల అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. నిందితులపై పశువుల అక్రమ రవాణా, పశువుల పట్ల క్రూరత్వానికి సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పశువుల అక్రమ రవాణా, జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్. ఐ సతీష్ హెచ్చరించారు.