షార్ట్ సర్క్యూట్‌తో కోళ్ల ఫారం దగ్ధం
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), నవంబర్ 23 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని ఓ కోళ్ల ఫారం అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన బట్టమేకల రాములుకు చెందిన కోళ్ల ఫారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. 10 కేవీ విద్యుత్ లైన్‌కు సంబంధించిన బుష్‌లో షార్ట్ సర్క్యూట్ (Short Circuit) కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి షెడ్ మొత్తం కాలిపోయిందని బాధితుడు తెలిపాడు.
ఈ ప్రమాదంలో షెడ్‌తో పాటు అందులో నిల్వ ఉంచిన కోళ్ల దాణా, ఇతర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం (Property Loss) వాటిల్లిందని రాములు ఆవేదన వ్యక్తం చేశాడు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, పలుమార్లు ఫిర్యాదు చేసినా విద్యుత్ లైన్లను సరిచేయలేదని ఆరోపించాడు. కోళ్ల ఫారంపైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోందని, ఇప్పుడు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని కన్నీటిపర్యంతమయ్యాడు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకున్నాడు.