ఆలయ అడుగున రిటైనింగ్ వాల్
మహబూబాబాద్,(విజయక్రాంతి): కాకతీయుల కాలం నాటి చారిత్రక శివ కోటేశ్వరాలయానికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు చేపట్టిన పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కాట్రపల్లి గ్రామంలోని ఈ పురాతన ఆలయం కొంతకాలంగా శిథిలావస్థకు చేరడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు.
ఆలయ పునరుద్ధరణ కోసం రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి రూ.4.50 కోట్ల నిధులు మంజూరు చేయించారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పునరుద్ధరణలో భాగంగా పాత నిర్మాణాన్ని తొలగించి, ప్రణాళికాబద్ధంగా కొత్త నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ప్రస్తుతం ఆలయ అడుగు భాగంలో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ పనులు పూర్తయిన అనంతరం ప్రత్యేక కాంక్రీట్ నిర్మాణం చేపట్టి, ఆలయానికి సంబంధించిన పాత శిలలను వినియోగిస్తూ నూతన ఆలయ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గుగులోత్ దస్రు నాయక్ తెలిపారు.
ఆలయ పునరుద్ధరణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పనుల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు గ్రామస్తులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాకతీయుల శిల్పకళకు ప్రతీకగా నిలిచిన ఈ ఆలయం పునరుద్ధరణతో మళ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.