దీపావళి తర్వాత ఉద్యమమే

07-11-2026 | 05:15am
  1. హామీలు అమలు చేయకపోతే వెనక్కి తగ్గబోం
  2. ప్రభుత్వానికి ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
  3. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్
  4. సీఎస్ తక్కువ అంచనా వేస్తున్నారు.. కండ్లు తెరిస్తే ఎక్కడ ఉంటారో చూసుకోవాలని హెచ్చరిక

హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయకుంటే దీపావళి తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary to the State Government) (సీఎస్) తమను తక్కువ అంచనా వేస్తున్నారని, సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం పరిష్కరించాలని చెప్పినా కూడా సీఎస్‌తోపాటు ఇతర పలువురు సచివాలయ ఉన్నతాధికారులు పెడచెవిన పెడుతున్నారని ఆరోపించింది.

శుక్రవారం నాంపల్లిలోని టీజీవో భవన్‌లో జేఏసీ విస్తృత స్థాయి సమావేశమైంది. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడారు. దీపావళిలోపు పీఆర్సీ రిపో ర్టును తెప్పించుకుని 51 శాతంతో ఫిట్‌మెంట్‌ను, పెండింగ్ డీఏలను ప్రకటించాలని డిమాండ్ చేశా రు. ప్రతి నెలా రూ.2 వేల కోట్లు పెండింగ్ బిల్లును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

వీటిని కూడా కేవలం కోర్టును ఆశ్రయిస్తున్నవారికే చెల్లించకుండా అందరికీ విడుదల చేయాలన్నారు. ఈహెచ్‌ఎస్ స్కీంను పటిష్టంగా అమలు చేయాలని, మెరుగైన వైద్యం అందక ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎల్ నినో కారణంగా ఉపాధ్యాయు లకు మినహాయించి మిగిలిన ఉద్యోగులకు వారం లో ఐదు రోజుల పనిదినం అమలు చేయాలన్నా రు. ఉపాధ్యాయుల సమస్యలు చాలా వరకు పెం డింగ్‌లో ఉన్నాయని, వారితో సమావేశాన్ని ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు.

అధికారులు సహకరించడం లేదు: జగదీశ్వర్

గతంలో తాము చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చినప్పుడు ప్రభుత్వం తమతో చర్చించి ప్రధాన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పిందని, వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ డిమాండ్ చేశారు. వాటిని నెరవేర్చుకుంటే దీపావళి తర్వాత ఉద్యోగుల జేఏసీ మరోసారి సమావేశమై ఉద్యమ కార్యాచరణను చేపడుతుందన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలు కోసం కమిటీ వేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చి తప్పిందని తెలిపారు.

‘దసరా ముందు రెండు డీఏలు ఇచ్చారు.. పెండింగ్‌లో ఉన్న మిగిలిన డీఏలను కూడా విడుదల చేయాలి. కేంద్రం ఇప్పటికే మరో డీఏను విడుదల చేసింది. పీఆర్సీ, డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేసి మా ఇండ్లలో దీపావళి దివ్వెలు వెలిగించాలి’ అని డిమాండ్ చేశా రు.

ఉద్యోగ, ఉపాధ్యాయులు, కార్మికుల హక్కులను సాధించడంలో తాము ఎక్కడా భయపడటం లేదని, గత జేఏసీ కంటే మెరుగ్గా పనిచేస్తున్నామన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని అధికా రులు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిసారి సీఎం, డిప్యూటీ సీఎం వద్దకు పోలేమని, వారు చెప్పినవి సీఎస్, ఇతర ఉన్నతాధికారులు అమలు చేయాలని అన్నారు. అధికారులు కొందరు తమతో సహకరించడం లేదని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ అమలుపై మన అధికారులు ఎందుకు అధ్యయనం చేయడం లేదని ప్రశ్నించారు.  

సీఎస్‌కు పీఎం ఆదేశాలు కావాలా?: శ్రీనివాసరావు

ఇప్పటి వరకు పీఆర్సీ రిపోర్టు ప్రభుత్వానికి చేరనేలేదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. గత నెలలోనే పీఆర్సీ కమిషన్ టైం అయిపోయిందని, కమిషన్‌కు జీతాలు ఇస్తున్నారో లేదో కూడా తెలియదన్నారు. ప్రభు త్వం ఉద్యోగుల కొన్ని సమస్యలను పరిష్కరించినప్పటికీ ఇంకా చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నెలవారీ పెండింగ్ బిల్లుల చెల్లింపులను రూ.2 వేల కోట్లకు పెంచాలన్నారు.

‘రాష్ట్ర సీఎస్‌కు సమస్యలను మొరపెట్టుకుందామని వెళ్తే ఆయన మాతో నిలబడి ఫొటోలకు పోజులిచ్చి పంపిస్తున్నారు తప్పితే.. కూర్చోబెట్టి మాట్లాడటంలేదు. సంఘాలకు గుర్తింపు కూడా ఇవ్వడంలేదు. ఈహెచ్‌ఎస్ ట్రస్టు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో మరికొన్ని సంఘాలను చేర్చడం ద్వారా వచ్చే నష్టం ఏమిటి? ప్రతి రెండు నెలలకోసారి సమావేశాలను నిర్వహించుకోవాలని సీఎం చెప్పినా సీఎస్ వినడంలేదు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎస్‌కు సీఎం ఆదేశాలకంటే ఇంకా ఎవరి ఆదేశాలు కావాలి?

పీఎం ఆదేశాలు కావాలా? ఎవరు చెబితే వింటారు’ అని ఆయన నిలదీశారు. ఇలా వ్యవహరిస్తే ఉన్నతాధికారుల తీరుపై సీఎంకు ఫిర్యాదు చేస్తామని, సీఎం ఇచ్చిన హామీలు కింది స్థాయిలో అమలు కావడం లేదన్నారు. ఉద్యోగులు ఏమైనా తప్పు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులతో కలిపి తాము ఆరు లక్షల మంది గ్రాడ్యుయేట్లు ఉంటామని, తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, ఇప్పటికే తమ కార్యాచరణను మూడునాలుగు సార్లు వాయిదా వేసుకున్నామన్నారు.

కింది స్థాయి ఉద్యోగులు తమ మాట వినే పరిస్థితి లేదని చెప్పారు. ‘మొత్తం ఉద్యోగ, ఉపాధ్యాయులమంతా కలిపి 13 లక్షల మంది ఉంటాం. కండ్లు తెరిస్తే మీరు ఎక్కడ ఉంటారో చూసుకోవాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యూరో క్రాట్స్ తమను తక్కువ అంచనా వేయొద్దని ఆయన హెచ్చరించారు.  సమావేశంలో జేఏసీ నాయకులు చావ రవి, జి.సదానందం గౌడ్, బి.మధుసూదన్ రెడ్డి, ముజీబ్ హుస్సేని, బీ శ్యామ్, కటకం రమేశ్, అనిల్ కుమార్, కస్తూరి వెంకటేశ్, రామారావు, రాధాకృష్ణ, అబ్దుల్లా, తిరుపతి, సత్యనారాయణ గౌడ్, ఉమాదేవి పాల్గొన్నారు.  


మరిన్ని వార్తలు