ఆదాయ లక్ష్యాలను చేరుకోవాలి
- ల్యాండ్ పూలింగ్, ప్రభుత్వ ఆస్తుల సమర్థ వినియోగంపై దృష్టి పెట్టాలి
- భూముల వేలం ప్రక్రియను దశలవారీగా చేపట్టాలి
- కేబినెట్ సబ్ కమిటీ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచన
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ఆర్థిక వనరులను(State financial resources) బలోపేతం చేయడంతోపాటు ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యాలను నిర్ణీత గడువుల్లో సాధించేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వ భూములు, పారిశ్రామిక లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్, భూముల వేలం ద్వారా ఆదాయ సమీకరణకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించాలన్నారు.
ఈ ప్రక్రియలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైంది. ఈ సమావేశంలో ఉప సంఘం సభ్యులు, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఆదాయ వనరుల సమీకరణపై సమీక్ష నిర్వహించారు.
ప్రతి శాఖ వారాలవారీగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకోవాలని, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించాలని భట్టి ఆదేశించారు. పారిశ్రామిక భూములకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా నిర్దేశిత ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అజామాబాద్, బాలానగర్, హఫీజ్‌పేట వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో యూనిట్లవారీగా భూముల క్రమబద్ధీకరణ, అనుమతుల ప్రక్రియలను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
బీ -కేటగిరీ, సూక్ష్మపారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించాలని, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించడంతో పాటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పారిశ్రామిక యూనిట్లకు సంబంధించిన దరఖాస్తులను నిర్ణీత గడువుల్లో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రత్యేక డిజిటల్ డ్యాష్ బోర్డ్ రూపొందించాలి
హైదరాబాద్ పరిసరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, ముఖ్యంగా మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్, భవిష్యత్ అవసరాలకు భూముల లభ్యత, భూ వనరుల సమీకరణపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన భూములను ముందుగానే గుర్తించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి సమకూరే భూ వనరులను అభివృద్ధి ప్రాధాన్యతలకు అనుగుణంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని, అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల వినియోగంలో ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి అవసరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. రోడ్లు, పార్కులు, పాఠశాలలు, ఆసుపత్రులు వంటి అత్యవసర మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వివిధ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన భూముల కేటాయింపునకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
హెచ్ఎండీఏ, టీజీఐఐసీ పరిధిలోని వేలానికి అనువైన లేఅవుట్లను గుర్తించాలని, ప్రధాన రహదారులకు మెరుగైన అనుసంధానం, అభివృద్ధికి అవకాశాలు ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. భూముల వేలం ప్రక్రియను దశలవారీగా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ప్రభుత్వ భూములు, లేఅవుట్ల అభివృద్ధి, వేలం సంబంధిత కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డిజిటల్ డ్యాష్ బోర్డ్ రూపొందించాలని సూచించారు.