భూ రీ-సర్వే, భూభారతి పరిష్కారం వేగవంతం చేయాలి

22-10-2026 | 07:02pm

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి: భూ రీ-సర్వే(Land Re-Survey), భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak) అన్నారు. గురువారం జిల్లాలోని బెల్లంపల్లి మండలం చాకపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను అధికారులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే ప్రక్రియ అమలు, సర్వే పనులలో పారదర్శకత, ఖచ్చితత్వం తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భూ రీ-సర్వేను సమర్థవంతంగా, పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మనోజ్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, తాండూర్ మండల తహసిల్దార్ జ్యోత్స్న లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా చేశారు.

తాండూర్ మండల పరిధిలో చేపట్టిన భూ రీ-సర్వే పనుల పురోగతి, భూభారతి పథకం క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై సమగ్రంగా సమీక్షించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు.

రైతులు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు భూ రికార్డులకు సంబంధించిన సమస్యలను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పరిష్కరించాలని తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, రైతులకు, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మరిన్ని వార్తలు