ఓఆర్‌ఎస్ అనుకుని ఎలుకల మందు తాగిన వృద్ధురాలు

14-11-2026 | 11:50am

ఘట్‌కేసర్, నవంబర్ 14 (విజయక్రాంతి): చిన్న పొరపాటు ఓ వృద్ధురాలి ప్రాణాలను బలిగొంది. నీరసంగా ఉందని ఓఆర్‌ఎస్ (ORS) అనుకుని ఎలుకల మందు (Rat Poison) తాగిన 73 ఏళ్ల మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.ఎదులాబాద్‌కు చెందిన తోటకూర రాములమ్మ (73) గత రెండు రోజులుగా నీరసంతో బాధపడుతోంది. ఈ క్రమంలో స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రదించింది. నీరసం తగ్గడం లేదని, ఓఆర్‌ఎస్ తాగినా ప్రయోజనం కనిపించడం లేదని వైద్యుడికి తెలిపింది. వృద్ధురాలు చెప్పిన విషయాలు విన్న ఆమె కుమారుడికి అనుమానం కలిగింది.

వెంటనే ఇంటికి వెళ్లిన కుమారుడు.. ఆమె తాగి పడేసిన ఖాళీ ప్యాకెట్‌ను (Empty Packet) పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ అనుకుని ఆమె తాగింది ఎలుకల మందు అని గుర్తించాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.ఆర్‌ఎంపీ వైద్యుడి సూచన మేరకు రాములమ్మను వెంటనే ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. గురువారం రాత్రి చికిత్స పొందుతూ రాములమ్మ మృతి చెందింది.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓఆర్‌ఎస్ అనుకుని ఎలుకల మందు ఎలా తాగింది? ప్యాకెట్ విషయంలో పొరపాటు ఎలా జరిగింది? అనే కోణాల్లో విచారణ (Investigation) జరుపుతున్నారు.నీరసం తగ్గించుకోవాలనుకున్న వృద్ధురాలు.. తెలియక చేసిన పొరపాటుతో ప్రాణాలు కోల్పోవడం కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.

మరిన్ని వార్తలు