భాగ్యనగర్ తండాలో బాలల దినోత్సవం
సింగరేణి, నవంబర్ 14 (విజయక్రాంతి): భాగ్యనగర్ తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ బానోత్ హిరాలాల్ అధ్యక్షతన బాలల దినోత్సవ వేడుకలు (Children's Day Celebrations), సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో బానోత్ పద్మ, తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో బాల్య వివాహాలను (Child Marriage) అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాలను నిరోధించడం ద్వారా చిన్నారుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన వారమవుతామని తెలిపారు.
అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, పింఛన్ల మంజూరు పత్రాలు, స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ హిరాలాల్ మాట్లాడుతూ గ్రామంలోని అర్హులందరికీ పారదర్శకంగా (Transparent Welfare Delivery) సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సహకారంతో గ్రామంలో ఇప్పటివరకు సుమారు 100కు పైగా ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు, గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, సన్న వడ్ల బోనస్, ఆసరా పింఛన్లు వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం చేరువైందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు మరోసారి మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుగులోత్ బిక్కులాల్, పంచాయతీ కార్యదర్శి పెండ్ర అనిల్, జీపీఓ సుమతి, వార్డు సభ్యులు గాంధీ, నాగేష్, కిషన్, మహేష్, అంకి, కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు గూగులోత్ హర్ష నాయక్, సీనియర్ నాయకులు గూగులోత్ భీముడు, భగవాన్ దాస్, రాంబాబు, రాజేష్, రేషన్ డీలర్లు దల్ సింగ్, చంటి, అంగన్వాడీ, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.