వలపు వలలో మాజీ సైనికుడు

14-11-2026 | 11:34am

బైక్‌పై లిఫ్ట్.. ఆపై హనీట్రాప్.. గిద్దలూరులో కలకలం!

గిద్దలూరు: లిఫ్ట్ అడిగిన మహిళతో పరిచయం.. ఆ తర్వాత సన్నిహితంగా మెలగడం.. చివరకు ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులు! ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఓ మాజీ సైనికుడు ఇలాంటి Honey Trap మోసానికి గురయ్యారు. వీడియోలు సోషల్ మీడియాలో పెడతానంటూ డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. గిద్దలూరుకు చెందిన మాజీ సైనికుడు నవంబర్ 9న తన ద్విచక్రవాహనంపై పీఆర్ కాలనీ నుంచి పట్టణానికి బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తుతెలియని మహిళ లిఫ్ట్ అడగడంతో ఆమెను బైక్‌పై ఎక్కించుకున్నారు. ప్రయాణంలో మాటలు కలిపిన ఆ మహిళ.. కొద్దిసేపటికే ఆయనకు దగ్గరైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసినట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఆ తర్వాత అసలు వ్యవహారం మొదలైంది. సదరు వీడియోలను Social Mediaలో పోస్టు చేస్తానంటూ మహిళ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా ఉండాలంటే రూ.1.50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు వెల్లడించారు. ఆమె వేధింపులతో భయాందోళనకు గురైన మాజీ సైనికుడు PhonePe ద్వారా ఇప్పటికే సుమారు రూ.7 వేలు పంపించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయినా బెదిరింపులు ఆగకపోవడంతో బాధితుడు చివరకు గిద్దలూరు అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆచూకీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి బెదిరింపులకు భయపడి డబ్బులు చెల్లించకుండా పోలీసులను సంప్రదించాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది.

మరిన్ని వార్తలు