ప్రజల కళ్లలో రేవంత్ మట్టికొట్టిండు

14-11-2026 | 01:28pm

రేవంత్ సర్కారుపై ఈటల సంచలన ఆరోపణలు.. హైడ్రాపైనా తీవ్ర విమర్శలు!

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్(Etela Rajender) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజాస్వామ్యం, సైన్యం, ఎన్నికల వ్యవస్థపై విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు భారత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ పాలనలోనే(Congress Government) అవినీతి, బాంబు పేలుళ్లు, రాజకీయ అస్థిరత చోటుచేసుకున్నాయని ఈటల ఆరోపించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అంతర్జాతీయంగా బలమైన స్థానాన్ని సంపాదించుకుందని, గతంలో మాదిరిగా విదేశీ రుణాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేదని అన్నారు. మోదీని రాజకీయంగా ఎదుర్కోలేక రాహుల్ గాంధీ నిరాశతో మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపైనా ఈటల ప్రశ్నలు సంధించారు. విద్యార్థులకు Fee Reimbursement, రైతులకు Rythu Bharosa అందడం లేదని ఆరోపించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలంటే 15 శాతం కమిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో భారీ మొత్తాలు ఖర్చు చేస్తూ సమ్మిట్‌లు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల ఆశలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీళ్లు చల్లిందని విమర్శించారు.

హైడ్రాపై ఈటల తీవ్ర ఆరోపణలు

హైడ్రా (HYDRAA) వ్యవహారంపై స్పందిస్తూ.. పేదలను భయపెట్టడానికి, బ్లాక్‌మెయిల్ చేయడానికి ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఈటల ఆరోపించారు. LRS ఉన్నప్పటికీ, సరైన నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారని విమర్శించారు. కోర్టులు ఇచ్చే Stay Ordersను కూడా పట్టించుకోకుండా హైడ్రా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఫాక్స్ సాగర్ పరిధిలోని భూముల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని అన్నారు. నటుడు నాగార్జునకు సంబంధించిన నిర్మాణం కూల్చివేత వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ, కూల్చివేత వల్ల జరిగిన నష్టానికి మించి ఆయనకు ప్రయోజనం కల్పించారని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలో బయటపెడతామని చెప్పారు.

ప్రజల ఆస్తులను కూల్చివేసే విషయంలో అధికారులు, పాలకులు బాధ్యతగా వ్యవహరించాలని, హైకోర్టు కూడా ఈ అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మూసీ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, బాధితులకు సరైన Compensation చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని ఈటల సూచించారు. ఉద్యోగులకు జీతాలు, ప్రయోజనాలు సకాలంలో ఇవ్వలేని ప్రభుత్వం భారీ కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలి వల్ల కాంగ్రెస్ పార్టీకి మరో 20 ఏళ్ల పాటు అధికారం దూరమయ్యే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని ఈటల జోస్యం చెప్పారు.

మరిన్ని వార్తలు