మళ్లీ నీళ్లు జల్లినట్టే!
కృష్ణా జలాలపై తేలని పంచాయితీ
మళ్లీ బోర్డు ముందుకు నీటి కేటాయింపుల అంశం
19 టీఎంసీలు కావాలన్న ఏపీ అధికారులు
ఫిబ్రవరి వరకు 21 టీఎంసీలు అవసరమన్న తెలంగాణ
సాగర్‌లో 45 టీఎంసీలే అందుబాటులో ఉన్నాయని వెల్లడి
హైదరాబాద్ తాగునీటికే 15 టీఎంసీలు కావాలని స్పష్టీకరణ
ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మీటింగ్
హైదరాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి) : కృష్ణా జలాల వినియోగంపై(Utilization of Krishna Waters) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. హైదరాబాద్‌లోని జలసౌధలో సోమవారం జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(Krishna River Management Board) (కేఆర్‌ఎంబీ) త్రిసభ్య కమిటీ సమావేశం ఏ నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. నీటి అవసరాలు, కేటాయింపులపై ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించగా.. ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ అంశాన్ని పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో మరోసారి చర్చించాలని నిర్ణయించారు.
సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) మొత్తం 19 టీఎంసీల నీరు కావాలని కోరింది. దీనికి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చే ఫిబ్రవరి వరకు తమ అవసరాల కోసం 21 టీఎంసీలు అవసరమని స్పష్టం చేసింది. నాగార్జునసాగర్‌లో(Nagarjunasagar) ప్రస్తుతం 45 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉందని, వచ్చే జులై వరకు ఈ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు వివరించారు. సమావేశం అనంతరం తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ రమేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసమే వచ్చే జులై వరకు 15 టీఎంసీల నీరు అవసరమవుతుందని తెలిపారు.
సాగర్‌లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలతో పాటు కుడి, ఎడమ కాల్వలకే వినియోగించాలని బోర్డు సమావేశంలో స్పష్టం చేసినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా డెల్టాకు ఒక్క టీఎంసీ నీటిని కూడా ఇచ్చే అవకాశం లేదని తెలంగాణ వాదించినట్లు వెల్లడించారు.
హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించిన తర్వాత మిగిలే 25 టీఎంసీల వినియోగంపై చర్చించాలని సూచించినట్లు తెలిపారు. సాగర్‌లో ఉన్న 45 టీఎంసీల్లో మరో 5 టీఎంసీల వరకు ఆవిరి రూపంలో నష్టపోయే అవకాశం ఉందని వివరించారు. అందుబాటులో ఉన్న పరిమిత నీటిని దృష్టిలో పెట్టుకుని అవసరాలకు అనుగుణంగా వినియోగ ప్రణాళిక రూపొందించుకోవాలని తెలంగాణ అభిప్రాయపడింది.
పల్నాడు వాటర్ గ్రిడ్‌పై వాడీవేడి చర్చ..
ఆంధ్రప్రదేశ్‌లోని పులిచింతల ప్రాజెక్టులో ఇప్పటికే 42 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించారు. పట్టిసీమ ద్వారా కూడా కృష్ణా డెల్టాకు నీరు సరఫరా అవుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో ఉన్న నీటిని తెలంగాణ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ వినియోగించాలని కోరారు. మరోవైపు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఏపీ పట్టుబట్టింది. ఈ విషయంపై పది రోజుల క్రితమే కేఆర్‌ఎంబీకి లేఖలు రాసినట్లు ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు.
డెల్టా అవసరాలను దృష్టిలో పెట్టుకుని నీటిని కేటాయించాలని కోరినట్లు చెప్పారు. సమావేశంలో పల్నాడు వాటర్ గ్రిడ్ అంశాన్ని తెలంగాణ అధికారులు లేవనెత్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై వివరణ కోరినట్లు తెలిసింది. అయితే గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈ పనులు చేపడుతోందని, ఆ శాఖకు సంబంధించిన వివరాలు తమకు తెలియవని ఏపీ జలవనరుల శాఖ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఈ అంశంపై సమావేశంలో పూర్తిస్థాయి చర్చ జరగలేదని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి తెలిపారు. మొత్తంగా ఇరు రాష్ట్రాల మధ్య నీటి అవసరాలు, సా గర్ నీటి వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం తో త్రిసభ్య కమిటీ ఎలాంటి నిర్ణయానికి రా లేకపోయింది. దీంతో 19 టీఎంసీలు కావాలన్న ఏపీ ప్రతిపాదన, 21 టీఎంసీలు అవసరమన్న తెలంగాణ వాదనపై పూర్తిస్థాయి బోర్డు సమావేశంలో మరోసారి చర్చ జరగనుం ది. అప్పటివరకు కృష్ణా జలాల పంపిణీపై ఉత్కంఠ కొనసాగనుంది.