హిజాబ్ వివాదం.. గాయనికి 74 కొరడా దెబ్బలు
ఇరాన్: హిజాబ్ నిబంధనలను(Hijab rules) పక్కనపెట్టి సంగీత ప్రదర్శన ఇచ్చిన ఓ ప్రముఖ గాయనికి అక్కడి అధికారులు 74 కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. ఈ ఘటన అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఇరాన్‌కు చెందిన గాయని పరస్తూ అహ్మదీ (Parastoo Ahmadi) 2024 డిసెంబర్లో ఖోమ్ సమీపంలోని చారిత్రక దెయిర్ గచిన్ కారవాన్సరాయ్(Historic Deir Gachin Caravanserai)లో హిజాబ్ లేకుండా పాటలు పాడారు.
పురుష సంగీత కళాకారులతో కలిసి ఇచ్చిన ఈ ప్రదర్శనకు ప్రత్యక్ష ప్రేక్షకులు లేకపోయినా.. యూట్యూబ్‌లో లైవ్‌స్ట్రీమ్(YouTube Livestream) చేయడంతో భారీగా వీక్షణలు వచ్చాయి. ఈ ప్రదర్శనపై నమోదైన కేసులో అహ్మదీతో పాటు ఆమె బృందానికి చెందిన మరో నలుగురికి 74 కొరడా దెబ్బల శిక్ష విధించారు. నవంబర్ 23న ఖోమ్‌లో ఈ శిక్ష అమలైనట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా రెండేళ్ల పాటు విదేశీ ప్రయాణాలు, కళా, సంగీత కార్యక్రమాల్లో పాల్గొనడంపైనా నిషేధం విధించారు. ఈ ఘటనతో ఇరాన్లో మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వస్త్రధారణపై ఆంక్షలు మరోసారి చర్చకు వచ్చాయి. 2022లో మహ్సా అమిని పోలీసు కస్టడీలో మరణించిన ఘటన తర్వాత హిజాబ్ నిబంధనలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. తాజాగా గాయనికి విధించిన శిక్షపై అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.