పప్పూ.. నీ పప్పులుడకవ్
రాహుల్‌గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం
- చొరబాటుదారుల ఓట్లు తీస్తే బాధేంటి?
- ఎన్ని డ్రామాలు ఆడినా మేం తగ్గబోం
- మోదీని టచ్ చేస్తే మాడిమసైపోతావ్
- రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 90 సీట్లొస్తాయని సీఎం అనడం పెద్ద జోక్
- ఏం చేశారని మీకు ప్రజలు ఓటేస్తరు
- కరీంనగర్ బీజేపీ మహాపాదయాత్రలో కేంద్ర మంత్రి బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం
కరీంనగర్, నవంబర్ 23 (విజయక్రాంతి): చొరబాటుదారుల ఓట్లను తీసేస్తే రాహుల్ గాంధీకి(Rahul Gandhi) వచ్చిన బాధేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) ప్రశ్నించారు. ‘పప్పూ.. నీ పప్పులుడకవ్. అక్కడున్నది నిప్పు మోదీ(Modi)... టచ్ చేస్తే మాడి మసైపోతావ్ జాగ్రత్త.. నువ్వెన్ని డ్రామాలాడినా, విదేశీ శక్తులతో(foreign powers) కలిసి కుట్రలు చేసినా తగ్గేదేలే..’ అని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ అక్రమ వలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు(Votes, ration cards) పొంది ఇక్కడి ప్రజల పొట్ట కొడుతుంటే చూస్తూ ఊరుకోవాల్నా అని ప్రశ్నించారు.
చొరబాటుదారులు ఈ దేశ ప్రధాని, సీఎంలను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. సోమవారం కరీంనగర్లో చేపట్టిన మహాపాదయాత్రలో బండి సంజయ్ భావోద్వేగంగా ప్రసంగించారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు జనం హర్షద్వానాలు చేశా రు. ‘జై బీజేపీ, జై మోదీ.. జై సంజయన్న’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
‘నన్నుగన్న ఈ కరీంనగర్ గడ్డ ఇప్పుడు కాషాయ దళ ప్రభంజనాన్ని చూసి ఉరకలేస్తున్నది.. ఈ ప్రభంజనాన్ని చూసి నా మనసు పులకరిస్తున్నది. నితిన్ నబీన్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టినంక నా గుండె ఉప్పొంగుతున్నది’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. నమ్మిన సిద్దాంతం కోసం తెగించి కొట్లాడతానని, ‘కరీంనగర్ నా కాషాయ అడ్డా’ అని తొడగొట్టి సవాల్ విసరాలని ఉందని అన్నారు.
రాహుల్‌కు వచ్చిన బాధేంది?
రాహుల్ గాంధీకి ‘సర్’తో నష్టమేందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ‘చచ్చిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేంది? 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నొప్పేంది? శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నష్టమేంది? కోటి మంది డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేంది? అని ప్రశ్నించారు.
భారత దేశంలో 18 ఏండ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పిస్తే మీకొచ్చిన బాధేంది? బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటుందా?’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డ్రగ్స్ బారిన పడి యువత అల్లాడుతుంటే ప్రధాని మోదీ కంట తడి పెట్టారని, నషా ముక్త్ భారత్ పేరుతో డ్రగ్స్ రహిత సమాజం కోసం పనిచేస్తున్నారన్నారని తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీకి అవకాశం ఇవ్వండి
‘తెలంగాణలో బీజేపీ యాడ ఉందన్న కాంగ్రెస్ నేతల్లారా.. ఇక్కడి ప్రభంజనాన్ని చూడండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టడానికి కాషాయ దళం ఎట్లా ఉరకలేస్తున్నదో చూడండి. నితిన్ నబీన్ కొదమ సింహం. నబీన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. పక్కన నిలబడితే ‘వేడి’ తగులుతుంది. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబీన్ అంటే నూతనత్వం’ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆషామాషీ లీడర్ కాదని.. 25 ఏండ్లకే ఎమ్మెల్యే కావడంతోపాటు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయన సొంతమని గుర్తు చేశారు.
45 ఏండ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీకి అధ్యక్షుడైన ఘనత నితిన్ నబీన్ సొంతమని బండి సంయ్ పేర్కొన్నారు. ‘తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ఏండ్ల తరబడి నా బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటం మామూలుది కాదు. కాషాయ జెండా మోసి మోసి కార్యకర్తల భుజాలు కాయలు కాసినయ్.. లాఠీ దెబ్బలు తిని ఒళ్లంతా గిర్రలు గీసినయ్.. అయినా నా బీజేపీ కార్యకర్త ఎన్నడూ భయపడలేదు’ అని బండి సంజయ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, 1 కోటి ఓట్లు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం పెద్ద జోక్ అని పేర్కొన్నారు. వారు ఏం చేశారని అన్ని సీట్లు వస్తాయని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలి’ అని నిలదీశారు. రాష్ట్రంలో అందరికీ అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.