నర్సాయిగూడెం రోడ్డు అభివృద్ధికి రూ.2.20 కోట్ల నిధులు
నిధుల మంజూరుపై హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు.
నేరేడుచర్ల, నవంబర్ 13(విజయ క్రాంతి): నర్సాయిగూడెం(Narsaigudem) ప్రజల చిరకాల రోడ్డు కష్టాలకు త్వరలో తెరపడనుంది. హుజూర్నగర్ ఆర్అండ్బీ రోడ్డు(Huzurnagar R&B Road) నుంచి నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని నర్సాయిగూడెం వరకు నూతన రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2 కోట్ల 20 లక్షల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రోడ్డు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రాంతాన్ని మున్సిపల్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన వెంకటరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నర్సాయిగూడెం ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చే దిశగా మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని భారీగా నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మంజూరైన నిధులతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో నర్సాయిగూడెం ప్రజలు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నూకల.సందీప్ కుమార్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు అలక శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్ నన్నేపంగు శ్రీనివాస్, మాజీ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, నాయకులు కట్ట గణేష్ రెడ్డి, బెల్లంకొండ శ్యామసుందర్ రెడ్డి, భగవంతు రెడ్డి, మొగరాల శీను, మచ్చ రవి తదితరులు పాల్గొన్నారు.