25 కిలోల బస్తాపై 26 కిలోల ముద్ర.. అసలు మోసం ఇదే!

03-11-2026 | 07:14am

హైదరాబాద్: బియ్యం కృత్రిమ కొరత సృష్టిస్తూ, అధిక ధరలకు విక్రయించి వినియోగదారులను మోసం చేస్తున్న వ్యాపారులపై పౌరసరఫరాల శాఖ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 18 వ్యాపార సంస్థలను గుర్తించారు. వీటిపై 11 ఎఫ్ఐఆర్‌లు (FIRs) నమోదు చేశారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, తూనికలు-కొలతల శాఖ అధికారులు సంయుక్తంగా అక్టోబర్ 29 నుంచి 31 వరకు రిటైల్, హోల్‌సేల్ బియ్యం దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు (Surprise Inspections) నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

కొంతమంది వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. 25 కిలోల బియ్యం బస్తాలపై 26 కిలోలుగా లేబుళ్లు ముద్రించి విక్రయిస్తున్నట్లు తేలింది. కంపెనీలు ముద్రించిన అసలు ధరలను కప్పిపుచ్చుతూ, అధిక ధరలతో కొత్త స్టిక్కర్లు అతికించి వినియోగదారుల నుంచి అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

ట్రేడ్, జీఎస్టీ, కార్మిక, ఆహార భద్రత వంటి తప్పనిసరి అనుమతులు, లైసెన్సులు లేకుండానే కొన్ని సంస్థలు వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, ఇతర మార్గాలకు తరలించడం వంటి ఉల్లంఘనలను కూడా అధికారులు గుర్తించారు.

ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేశారు. నేర తీవ్రతను బట్టి నిందితులకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది.

బియ్యం కొరత సృష్టించడం, కృత్రిమంగా ధరలు పెంచడం, తూకాల్లో మోసాలకు పాల్పడటాన్ని సహించేది లేదని అధికారులు హెచ్చరించారు. వినియోగదారులకు నాణ్యమైన నిత్యావసర సరుకులను సరసమైన ధరలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు