ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా గేమ్స్

03-11-2026 | 05:15am
  1. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి
  2. అధికారులకు సీఎం ఆదేశం

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా ‘ఖేలో ఇండియా(Khelo India)’ యూత్ గేమ్స్‌ను నిర్వహించనున్నామని, ఏర్పాట్లలో ఎక్కడా లోపం ఉండొద్దని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానం, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే క్రీడల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నదని తెలిపారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించడమే దీర్ఘకాలిక లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, ప్రపంచస్థాయి క్రీడా శిక్షణను తెలంగాణ యువ క్రీడాకారులకు అందించేందుకు ఈ పోటీలను గొప్ప అవకాశంగా మలుచుకోవడం ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

  రాష్ట్రంలో డిసెంబర్ 11 నుంచి 22 వరకు నిర్వహించనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేలో ఇండియా పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా పోటీలకు ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు. 

గ్రూప్ 1 స్థాయి అధికారులకు బాధ్యతలు

అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో క్రీడా ప్రాంగణాలను తీర్చిదిద్ది ఖేలో ఇండియా పోటీల తర్వాత కూడా అవి గొప్ప క్రీడా వనరులుగా ఉపయోగపడేలా చూడాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఏర్పాట్లలో నాణ్యతా ప్రమాణాల లోపం లేకుండా పటిష్ట చర్యలు తీసుకునే విధంగా గ్రూప్-1 స్థాయి అధికారులకు ఏర్పాట్ల నుంచి క్రీడలు ముగిసే వరకు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించాలన్నారు.

వివిధ జిల్లాల్లో జరగనున్న పోటీలకు సంబంధించి ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం ఆయా చోట్ల స్థానికంగా పనిచేస్తున్న ట్రైనీ అధికారులు, గ్రూప్-1 అధికారులను నియమించాలని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో క్రీడలకు కొన్ని చోట్ల చేపట్టిన మౌలిక సదుపాయాల పనులు క్రీడా పోటీలు ముగిసిన కొన్నేళ్లలోనే విచ్ఛిన్నం అయ్యాయని, అలాంటి పరిస్థితి రావొద్దన్నారు. 

మరిన్ని వార్తలు