బినామీల పేర కోట్ల ఆస్తులు!

25-09-2026 | 05:15am
  1. మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డికి బినామీలు 8 మంది 
  2. 10 ప్రాంతాల్లో ఏసీబీ దాడులు 
  3. 1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, మద్యం స్వాధీనం 
  4. బినామీల పేర్లపై రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు లావాదేవీల రికార్డుల గుర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో/మణికొండ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ (పీసీఎస్) మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి(DSP Sankireddy Bhimreddy) ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ(ACB) దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ కేసులో భాగంగా గురువారం హైదరాబాద్‌లోని పుప్పాలగూడ, జహీరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో సాగిన ఈ తనిఖీల్లో భీమ్‌రెడ్డికి చెందిన 8 మంది అనుమానిత బినామీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. ఈ సోదాల్లో బొమ్మ వెంకటేశ్ (కోమటి వెంకటేశ్) అనే బినామీ నివాసంలో రూ.1.35 కోట్ల నగదు, భారీగా విదేశీ కరెన్సీ లభించడం కలకలం రేపింది.

దాంతోపాటు సుమారు 14 లీటర్ల విదేశీ మద్యాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనుమతికి మించి విదేశీ మద్యం ఉన్నందున ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖకు సమాచారం అందించామని, వారి ప్రాథమిక పరిశీలన అనంతరం చట్టప్రకారం కేసు నమోదయ్యే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. బినామీల పేర్లపై ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు లావాదేవీల రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని ఏసీబీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 

గతంలో జూన్ 27న నమోదు చేసిన కేసుకు సంబంధించి కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. గతంలోనే ఏసీబీకి పట్టుబడ్డ భీమ్‌రెడ్డికి ఇతర రాష్ట్రాల్లోనూ రూ.200 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.  తెలంగాణతో పాటు కర్ణాటకలోని బెంగళూరు విమానాశ్రయం సమీపంలో విలువైన భూములు, జహీరాబాద్, వికారాబాద్‌లో సుమారు 40 ఎకరాల వ్యవ సాయ భూమి కొనుగోలు చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి.

మరిన్ని వార్తలు