విద్యుత్ అంతరాయాలపై సీఎం ఫైర్!
హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులను ప్రశ్నించారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. బొగ్గు సరఫరాకు లింకేజీలు ఉన్నప్పటికీ ప్లాంట్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను నిలదీశారు. విద్యుత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి, ఉత్పత్తి పెంపునకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పంటలను కాపాడేందుకు రైతులకు నిరంతర విద్యుత్ అందించాలని, సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఉత్పత్తి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని రేవంత్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. బాధ్యతల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తి, బొగ్గు సరఫరా, పంపిణీ వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు, రైతులకు నిరంతర విద్యుత్ అందించడం ప్రభుత్వానికి కీలకంగా మారింది.