17న బతుకమ్మ అవార్డుల వేడుక

14-10-2026 | 07:36pm

యువ ఫిల్మ్ మేకర్స్‌కు ప్రోత్సాహం.. 17న బతుకమ్మ అవార్డుల వేడుక!

హైదరాబాద్: తెలంగాణ యువతలోని సృజనాత్మక ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్–సీజన్ 2’(Bathukamma Young Filmmakers Challenge Season 2) అవార్డుల వేడుకకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో ఈ నెల 17న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో కార్యక్రమం జరగనుంది.

అవార్డుల ప్రదానోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)ను నిర్వాహకులు ఆహ్వానించారు. టీజీఎఫ్‌డీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. ముకుంద రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ క్రియేటివ్ డైరెక్టర్ కొండ రాజు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందించింది.

రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, బతుకమ్మ వంటి పండుగలు, జానపద కళారూపాలను ఆధునిక దృశ్య మాధ్యమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేయడం ఈ ఛాలెంజ్ ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా సినిమాలు, పాటలు, వీడియోలు, కథనాల రూపంలో ప్రజలకు చేరువ చేయడంపై నిర్వాహకులు దృష్టి సారించారు.

రెండో సీజన్‌కు యువ ఫిల్మ్ మేకర్స్(Young Filmmakers), కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల నుంచి మంచి స్పందన లభించింది. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు అవార్డుల కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, జ్యూరీ సభ్యుడు అంతడుపుల నాగరాజు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు