చోరీ కేసు ఛేదించిన పోలీసులు
చిన్నారి మెడలోని బంగారు లాకెట్ చోరీ కేసు ఛేదించిన పోలీసులు
సీసీఎస్, టౌన్ పోలీసుల సంయుక్త దర్యాప్తుతో నిందితుల గుర్తింపు
భూపాలపల్లి,(విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణంలో చిన్నారి మెడలోని బంగారు హనుమాన్ లాకెట్ చోరీ కేసును సీసీఎస్, టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి ఛేదించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నాచారం నివాసి మంజు కవిత, ఆమె భర్త శ్రీధర్‌ను గుర్తించారు. మైసమ్మ కాలనీకి చెందిన జరుపుల బాలాజీ ఈ నెల 11న భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాసం ఫ్యాషన్ మాల్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు.
మరుసటి రోజు ఉదయం చిన్నారి మెడలోని బంగారు హనుమాన్ లాకెట్ కనిపించకపోవడంతో పాటు మెడపై గోళ్లతో గీరినట్లుగా గుర్తులు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను గుర్తించారు. విచారణలో చిన్నారి మెడలోని బంగారు లాకెట్‌ను దొంగిలించినట్లు వారు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ సందర్భంగా పట్టణ సీఐ సి.హెచ్. శ్రీనివాస్ మాట్లాడుతూ, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, రద్దీ ప్రాంతాలకు వెళ్లినప్పుడు తల్లిదండ్రులు చిన్నారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిల్లలకు బంగారు ఆభరణాలు ధరింపజేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దొంగతనం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బానోతు గీత ఉన్నారు.