బోధన్ పట్టణంలో కల్తీ నూనె స్వాధీనం
ముగ్గురు వ్యక్తులు అదుపులోకి.. పోలీసుల దాడి
బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలో కల్తీ నూనె తయారీ(illegal oil manufacturing unit) వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలో పశువుల కొవ్వు, ఎముకలు, తోళ్లతో అక్రమంగా నూనె తయారు చేస్తున్నారన్న సమాచారంతో చీతా ఫోర్స్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో సుమారు 900 లీటర్ల నూనెను స్వాధీనం చేసుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గాంధీనగర్లో అక్రమంగా నూనె తయారు చేస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మహమ్మద్ సఫీఉద్దీన్, మహమ్మద్ సోఫిఉద్దీన్, అబ్దుల్ అన్వర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నూనె తయారీ విధానం, దాని వినియోగం, ఇతర వివరాలపై తదుపరి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ దాడిలో చీతా ఫోర్స్ ఎస్ఐ శ్రీను, బోధన్ ఎస్ఐ రామ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ వెల్లడించారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కల్తీ ఉత్పత్తుల తయారీ, విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.