కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు ఆర్మీ సాయం
డిప్యూటేషన్‌పై ముగ్గురు ఆర్మీ ఇంజినీర్లు
ఎస్ఎల్బీసీకి ఒకరు.. కాళేశ్వరం బరాజ్‌లకు ఇద్దరు పనుల్లో వేగం, నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం
ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): శ్రీశైలం ఎడమగట్టు కాలువ(Srisailam left bank canal)(ఎస్ఎల్బీసీ) సొరంగం పనులు, కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ పనులను(Kaleshwaram Barrages Renovation Works) పటిష్ఠంగా, వేగవంతంగా చేపట్టేందుకు ఆర్మీ ఇంజినీరింగ్ అధికారుల సేవలు(Services of Army Engineering Officers) వినియోగించుకోనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి(N Uttam Kumar Reddy) తెలిపారు. కీలకమైన ఈ పనుల్లో వేగంతో పాటు నాణ్యత, భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని చెప్పారు. ఇందుకోసం ముగ్గురు ఆర్మీ అధికారులను డిప్యూటేషన్‌పై తీసుకురావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ముగ్గురు ఆర్మీ ఇంజినీర్లలో ఒకరిని ఎస్ఎల్బీసీ సొరంగం పనుల పర్యవేక్షణకు, మరో ఇద్దరిని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు వినియోగించుకోను న్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం ఎంపిక చేసుకునేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయం లెఫ్టినెంట్ కల్నల్ సత్యదేవ్సింగ్, లెఫ్టినెంట్ కల్నల్ రంజిత్ ఏ.మీనన్, లెఫ్టినెంట్ కల్నల్ హెచ్వీ భల్లా పేర్లను పంపినట్లు తెలిపారు. ఇటీవల ఢిల్లీలో భారత సైన్యాధిపతి జనరల్ ధీరజ్సేథ్ను కలిసి ఎస్ఎల్బీసీ సొరం గం పనుల్లో ఎదురవుతున్న సాంకేతిక సవాళ్లు, కాళేశ్వరం బరాజ్‌ల పునరుద్ధరణ అవసరాన్ని వివరించానని, అనుభ వజ్ఞులైన ఆర్మీ ఇంజినీర్లను డిప్యుటేషన్‌పై పంపించాలని కోరినట్లు మంత్రి పేర్కొన్నారు.
ఈ మేరకు ఆర్మీ ప్రధాన కార్యా లయం స్పందించి ముగ్గురు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిందని వివరించారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కచ్చితత్వంతో పనిచేసే శిక్షణ ఆర్మీ అధికారులకు ఉంటుందని, సాంకేతిక నైపుణ్యంతోపాటు క్రమశిక్షణ, నాయకత్వం, జవాబుదారీతనం, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారి ప్రత్యే కత అన్నారు. వారి అనుభవాన్ని రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఉప యోగించుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు.
2028 జూన్ వరకు ఎస్ఎల్బీసీ పూర్తి
ప్రస్తుతం తెలంగాణలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న కల్నల్ పరీక్షిత్ మెహ్రా సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఉత్తమ్ తెలిపారు. ఎస్ఎల్బీసీ నిర్మాణం, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ ప్రణాళికల రూపకల్పన, క్షేత్రస్థాయి పర్యవేక్షణలో ఆయన కీలకంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ అనుభవంతోనే మరికొందరు ఆర్మీ ఇంజినీర్ల సాయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు. సుమారు 44 కిలోమీటర్ల పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగంలో ఇప్పటికే దాదాపు 35 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కొత్తగా నియమించనున్న ఆర్మీ అధికారి సొరంగం రెండు వైపులా జరుగుతున్న తవ్వకాలతోపాటు లోపలి పనులు, వెంటిలేషన్, భద్రతా ఏర్పాట్లు, క్షేత్రస్థాయి సమన్వయాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారని చెప్పారు.
తుది దశకు బరాజ్‌ల పరీక్షలు
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను పూర్తి భద్రతతో తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. మట్టి, కాంక్రీట్, పునాదులకు సంబంధించిన పరీక్షలు తుది దశకు చేరాయని తెలిపారు. పరీక్షల ఫలితాలను ఐఐటీ బాంబే, ఏఎఫ్ఆర్వై ఇండియా నిపుణులు విశ్లేషిస్తూ అవసరమైన పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేస్తున్నారని వివరించారు. పనులను వేగంగా పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, అయితే వేగం పేరుతో కార్మికుల భద్రత, ఇంజినీరింగ్ ప్రమాణాలు, నిర్మాణాల దీర్ఘకాలిక స్థిరత్వం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడబోమన్నారు. ఆర్మీ ఇంజినీర్ల భాగస్వామ్యంతో నాణ్యత నియంత్రణ, క్షేత్రస్థాయి సమన్వయం, జవాబుదారీతనం మరింత బలోపేతమవుతాయని మంత్రి స్పష్టం చేశారు.