ఎమ్మెల్యే చొరవతో ఎత్తిపోతలకు జీవం

30-09-2026 | 11:49am

నంగునూరు,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): నంగునూరు మండలం ఖాతా పెద్దవాగు(Khata Peddavagu) నుంచి వృథాగా పోతున్న నీటిని చెరువుల్లోకి మళ్లించే 'వలసకుంట ఎత్తిపోతల పథకం' మళ్లీ కార్యరూపం దాల్చింది. దీంతో స్థానిక రైతుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి,స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు ప్రత్యేక చొరవతో ఖాతా పెద్దవాగు నుంచి నీటిని మళ్లించేందుకు రూ.3.33 కోట్ల నిధులు కేటాయించి ఈ పథక పనులను పూర్తి చేయించారు.గతంలో ఇది సక్రమంగానే పనిచేసినప్పటికీ,ఇటీవల విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తడం మరియు పంపులు మరమ్మతులకు గురికావడంతో మూలనపడింది.

ఈ సమస్యను ఖాతా,ఘనపూర్,కొండంరాజుపల్లి,గట్లమల్యాల గ్రామాల రైతులు ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) దృష్టికి తీసుకెళ్లారు.వెంటనే స్పందించిన ఆయన, తన సొంత ఖర్చులతో రూ. 50 వేలు వెచ్చించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు పంపులకు మరమ్మతులు చేయించారు.వాగుపై నిర్మించిన చెక్‌డ్యామ్ వద్ద నుంచి వృథాగా పోతున్న వరద నీటిని, ఖాతా శివారులోని సింగన్నకుంట, వలసకుంటలకు మళ్లించేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు స్థానిక సర్పంచ్ పుల్లరి సోని మహేష్, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి,అధికారులు మంగళవారం పంపింగ్ పనులను ప్రారంభించారు.ఈ రెండు కుంటల్లోకి నీరు చేరడం ద్వారా దాదాపు 280 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చి, 480 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మరుగున పడిన పథకానికి ఎమ్మెల్యే చేయూతనందించడం పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు